Skip to content
Opens in a new window

[1] “ద్వీపాల్లారా! నా ఎదుట ఊరుకోండి. జనాలు క్రొత్త బలం పుంజుకోవాలి. వారు నా సన్నిధానానికి వచ్చి మాట్లాడాలి. తీర్పు తీర్చే స్థలంలో మనం సమకూడుదాం రండి.

[2] నీతిని సాధించేవాణ్ణి తూర్పునుంచి పురికొలిపి తన పాదాల దగ్గరికి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనాలను అప్పగిస్తున్నాడు, రాజులను లోపరుస్తున్నాడు. అతడు తన ఖడ్గంచేత వాళ్ళను ధూళిపాలు చేస్తాడు. తన వింటిచేత వాళ్ళను గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేస్తాడు.

[3] అతడు వాళ్ళను తరుముతున్నాడు. ఇంతకుముందు తను అడుగుపెట్టని దారినే సురక్షితంగా సాగిపోతున్నాడు.

[4] ఈ పని పూనుకొని నెరవేర్చినదెవరు? ఆదినుంచి మానవ వంశాలను రప్పించినది ఎవరు? యెహోవా అనే నేనే. నేను మొదటివాణ్ణి. కడపటివారిలో కూడా ఉన్నవాణ్ణి.

[5] దీన్ని చూచి ద్వీపాలు భయపడుతున్నాయి. భూమి కొనలు వణకుతున్నాయి. వాటి జనాలు వచ్చి చేరుతున్నాయి.

[6] వాళ్ళు ఒకడికొకడు సహాయం చేస్తున్నారు. ‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు అంటున్నాడు.

[7] శిల్పి కంసాలిని ఉత్సాహపరుస్తున్నాడు. సుత్తితో నునుపు చేసేవాడు దాగలిమీద కొట్టేవాణ్ణి ఉత్సాహపరుస్తున్నాడు. ‘టంకం పని బాగా చేశావు’ అంటాడు. విగ్రహం కదలకుండా మేకులతో దానిని బిగిస్తాడు.

[8] “ఇస్రాయేలూ! నీవు నా సేవకుడివి. యాకోబూ! నిన్ను నేను ఎన్నుకొన్నాను. నీవు నా మిత్రుడైన అబ్రాహాము సంతానం.

[9] నేను నిన్ను భూమి కొనలనుంచి తీసుకువచ్చాను, దూరంగా ఉన్నదాని మూలలనుంచి నిన్ను రప్పించాను. నీవు నా సేవకుడివన్నాను. నేను నిన్ను ఎన్నుకొన్నాను, నిన్ను నిరాకరించలేదు.

[10] నేను నీతో ఉన్నాను, గనుక భయంతో ఉండబోకు. నేను నీ దేవుణ్ణి, గనుక హడలిపోవద్దు. నేను నీకు బలం చేకూరుస్తాను. నీకు సహాయం చేస్తాను. న్యాయాన్ని జరిగించే నా కుడిచేతితో నిన్ను పడకుండా పట్టుకొంటాను.

[11] “నీమీద కోపంతో మండిపడేవాళ్ళంతా సిగ్గుపడి అవమానం పాలవుతారు. నిన్ను ఎదిరించేవాళ్ళు అంతర్థానమై నశించిపోతారు.

[12] నీతో పోరాడేవాళ్ళను నీవు వెదికినా వాళ్ళు కనిపించరు. నీతో యుద్ధం చేసేవాళ్ళు అంతర్థానమై గతించిపోతారు.

[13] ఎందుకంటే, నేను – నీ దేవుడైన యెహోవాను – నీ కుడిచేతిని పట్టుకొంటున్నాను. భయపడవద్దు, నేనే నీకు సహాయం చేస్తాను అంటున్నాను.

[14] పురుగులాంటి యాకోబూ! స్వల్ప జనమైన ఇస్రాయేలూ! భయపడవద్దు. నేనే నీకు సహాయం చేస్తాను. ఇది యెహోవా వాక్కు. నీ విముక్తిదాత ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు.

[15] ఇదిగో విను! నేను నిన్ను నూర్పిడి సాధనంలాగా చేస్తాను. పదునైన అనేక కక్కులున్న క్రొత్త నూర్పిడి సాధనంలాగా చేస్తాను. నీవు పర్వతాలను నూరుస్తావు, వాటిని చూర్ణం చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు.

[16] నీవు వాటిని గాలిస్తావు. గాలి వాటిని తీసుకుపోతుంది. సుడిగాలి వాటిని చెదరగొట్టివేస్తుంది. నీవు యెహోవామూలంగా సంతోషిస్తావు. ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడి ద్వారా ఉత్సాహపడుతావు.

[17] “దరిద్రులు, దురవస్థలో ఉన్నవారు నీళ్ళు వెదకుతున్నారు. నీళ్ళు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోతున్నది. నేను – యెహోవాను – వారికి జవాబిస్తాను. నేను – ఇస్రాయేల్ ప్రజల దేవుణ్ణి – వారిని విడిచి వెళ్ళను.

[18] చెట్లులేని మెరకలమీద నదులు పారేలా చేస్తాను. లోయలలో ఊటలు పెల్లుబికేలా చేస్తాను. ఎడారిని మడుగుగా, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తాను.

[19] ఎడారిలో దేవదారు వృక్షాలను, తుమ్మచెట్లను, గొంజిచెట్లను, ఆలీవ్‌చెట్లను నాటిస్తాను. ఎండిపోయిన ప్రాంతంలో తమాల వృక్షాలను, సరళ వృక్షాలను, నేరేడు చెట్లను నాటిస్తాను.

[20] యెహోవా చెయ్యి ఇలా జరిగించిందనీ ఇస్రాయేల్ ప్రజల పవిత్రుడు ఈ విధంగా కలిగించాడనీ ప్రజలు చూచి తెలిసికొని, నిదానించి తేటగా గ్రహించడానికి నేను అలా చేస్తాను.”

[21] “మీ వివాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. “మీ రుజువులు చూపెట్టండి” అని యాకోబు ప్రజల రాజు చెపుతున్నాడు.

[22] జరగబోయేవాటిని విశదపరచి మా ఎదుట తెలియజేయండి! మునుపు జరిగినవాటిని మేము ఆలోచించి వాటి ఫలితాన్ని తెలుసుకొనేలా వాటిని విశదపరచి చెప్పండి!

[23] భవిష్యత్తులో జరగబోయే సంగతులను తెలియజేస్తే మీరు దేవతలని మేము ఒప్పుకొంటాం! మేము దానిని గమనించి ఆశ్చర్యంతో చూచేలా ఏదైనా మేలు గానీ, కీడు గానీ జరిగించండి!

[24] మీరు లేనట్టున్నారు. మీ కార్యం శూన్యం. మిమ్మల్ని కోరుకొనేవాళ్ళు అసహ్యులు.

[25] “ఉత్తర దిక్కునుంచి నేనొక వ్యక్తిని పురికొలుపుతున్నాను. అతడు వస్తున్నాడు. అతడు నా పేర ప్రార్థన చేసేవాడు. అతడు సూర్యోదయ దిక్కునుంచి వస్తున్నాడు. బురద త్రొక్కేవిధంగా, కుమ్మరి మట్టిని త్రొక్కేవిధంగా అతడు అధికారులను త్రొక్కివేస్తాడు.

[26] మేము తెలుసుకొనేలా ఆది నుంచీ దీనిని గురించి తెలియజేసినదెవరు? ‘అతడు సరిగా చెప్పాడు’ అని మేము ఒప్పుకోవడానికి పూర్వకాలంలో దీనిని తెలియజేసినదెవరు? ఎవడూ తెలియజేయలేదు. ఎవడూ వినిపించలేదు. మీరు ఏ మాటా ఎవ్వరికీ చెప్పలేదు.

[27] ‘ఇవిగో, అవి!’ అని సీయోనుతో మొదట చెప్పినవాణ్ణి నేనే. జెరుసలంకు శుభవార్త ప్రకటించే వాణ్ణి నేను పంపాను.

[28] నేను చూస్తే ఎవడూ లేడు – వాళ్ళలో సలహా చెప్పడానికి ఎవడూ లేడు, నేను వాళ్ళను అడిగినదానికి జవాబివ్వగల వాడెవడూ లేడు.

[29] వాళ్ళంతా మిథ్య. వాళ్ళ పనులు శూన్యం, వాళ్ళ విగ్రహాలు వ్యర్ధం, వట్టి గాలి.

యెషయా — Chapters