[1] ఆకాశాలను చీల్చుకొని నీవు దిగివస్తావు గాక! అప్పుడు నీ సన్నిధానంలో పర్వతాలు కంపించి పోతాయి.
[2] అగ్ని గచ్చపొదలను కాల్చేలా, నీళ్ళు పొంగేలా చేసే విధంగా నీవు నీ శత్రువులకు నీ పేరు తెలిసేలా నీ సమక్షంలో జనాలు వణకేలా దిగి రా!
[3] మునుపు నీవు భయభక్తులు కలిగించే క్రియలు చేశావు. అవి జరుగుతాయని మేము ఎన్నడూ అనుకోలేదు. నీవు దిగి వచ్చావు. పర్వతాలు నీ సన్నిధానంలో కంపించాయి.
[4] నీకోసం ఎదురు చూచేవారి పక్షంగా నీవు క్రియలు జరిగించే దేవుడివి. అనాది కాలంనుంచి నీవు తప్ప ఇలా జరిగించే మరో దేవుణ్ణి ఎవరూ చూడలేదు, వినలేదు. నీ వంటి వేరే దేవుణ్ణి గురించి మనుషుల చెవులకు ఎప్పుడూ వినబడలేదు.
[5] నిన్ను మనసులో ఉంచుకొని నీ మార్గాలలో సంతోషంతో న్యాయాన్ని అనుసరించేవారిని నీవు సందర్శిస్తావు. మేమైతే పాపులం. గనుక నీవు మామీద కోపగించావు. చాలా కాలంనుంచి మా పాపాలలో ఉండిపొయ్యాం. మాకు రక్షణ కలుగుతుందా?
[6] మేమందరమూ అశుద్ధులలాంటి వాళ్ళమయ్యాం. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలలాగా ఉన్నాయి. మేమందరమూ ఆకులలాగా వాడిపోయేవాళ్ళం, గాలిలాగా మా అపరాధాలు మమ్మల్ని ఎగరగొట్టి తీసుకు పోతున్నాయి.
[7] నీ ముఖాన్ని మాకు కనబడకుండా దాచుకొన్నావు. మా అపరాధాల క్రింద మేము నీరసించేలా చేశావు, గనుక ఎవరూ నీ పేర ప్రార్థన చేయడం లేదు, నీమీద ఆధారపడడానికి తమను పురికొలుపుకోవడం లేదు.
[8] అయినా, యెహోవా, నీవు మా తండ్రివి. మేము జిగటమట్టిగా ఉన్నాం, నీవు మాకు కుమ్మరివి. మేమందరమూ నీవు చేతులతో చేసిన పని.
[9] యెహోవా, అత్యధికంగా కోపగించవద్దు. మా అపరాధాలను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకోవద్దు. ఇదిగో, దయ చేసి మావైపు చూడు. మేమందరమూ నీ ప్రజలం.
[10] నీ పవిత్ర పట్టణాలు బీడు భూములయ్యాయి. సీయోను బీడయింది. జెరుసలం పాడుగా ఉంది.
[11] మా పూర్వీకులు నిన్ను కీర్తించిన మా ఘనమైన పవిత్రాలయం మంటలపాలయింది. కోరతగిన మా వస్తువులన్నీ నాశనమైపొయ్యాయి.
[12] యెహోవా, ఇది చూచి నిన్ను నీవు తమాయించుకొంటావా? మౌనంగా ఉండి అత్యధికంగా మమ్మల్ని బాధిస్తావా?