[1] మేము తెలియజేసిన సమాచారం నమ్మినది ఎవరు? యెహోవా హస్తం ఎవరికి వెల్లడి అయింది?
[2] ఆయన యెహోవాయెదుట లేత మొక్కలాగా, ఎండిన భూమిలో అంకురంలాగా పెరిగాడు. మనం ఆయనవైపు చూచేలా ఆయనకు అందం గానీ, ఘనత గానీ లేదు. ఆయనలో మనలను ఆకర్షించేది ఏమీ కనబడలేదు.
[3] ఆయన మనుషుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన దుఃఖాలు అనుభవించిన మనిషి, బాధలంటే పరిచయం ఉన్నవాడు. ఆయనకు మన ముఖాలు కనబడకుండా చేసినట్లున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.
[4] ఆయన మన బాధలను భరించాడు. మన దుఃఖాలను వహించాడు. దేవుడు ఆయనను కొట్టాడనీ, మొత్తి బాధించాడనీ మనం భావించుకొన్నాం.
[5] కాని, ఆయన మన అక్రమ కార్యాల నిమిత్తమే గాయపడ్డాడు. మన అపరాధాల నిమిత్తమే ఆయనను నలగ్గొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన దెబ్బల మూలంగా మనకు ఆరోగ్యం కలిగింది.
[6] మనమందరమూ గొర్రెలలాగా తప్పిపోయాం. మనలో ఒక్కొక్కరం సొంత త్రోవకు తొలగిపోయాం. యెహోవా మన అందరి అపరాధాలను ఆయనమీద మోపాడు.
[7] ఆయన దౌర్జన్యానికి గురి అయ్యాడు. బాధలు అనుభవించాడు. అయినా ఆయన నోరు తెరవలేదు. వారు ఆయనను గొర్రెపిల్లలాగా వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించేవాడి ఎదుట గొర్రె ఊరుకొన్నట్టే ఆయన నోరు తెరవలేదు.
[8] వారు ఆయనను పట్టుకొని, అన్యాయంగా తీర్పు తీర్చి, తీసుకుపోయారు. నా ప్రజల అతిక్రమాల కారణంగా ఆయనను కొట్టడం జరిగింది. ఆయన సజీవుల లోకంనుంచి హతం అయ్యాడు. కాని, ఆయన తరంవారిలో ఈ సంగతి ఎవరు ఆలోచించారు?
[9] ఆయన చనిపోయినప్పుడు దుర్మార్గుల మధ్య, ధనవంతుడి దగ్గర సమాధిపాలయ్యాడు. ఆయన ఏమీ దౌర్జన్యం చేయలేదు, ఆయన నోట మోసం ఎప్పుడూ లేదు.
[10] అయినా ఆయనను నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమైంది. ఆయన తనను అపరాధాల కోసమైన బలిగా అర్పించుకొన్నందుచేత ఆయన సంతానాన్ని చూస్తాడు, చిరంజీవి అవుతాడు. యెహోవాకు ఏది ఇష్టమో అది ఆయనచేత సఫలం అవుతుంది.
[11] తన వేదనవల్ల కలిగిన ఫలితం చూచి, ఆయన సంతృప్తి పొందుతాడు. న్యాయవంతుడైన నా సేవకుడు చాలామంది అపరాధాలను భరించి తన జ్ఞానంచేత వారిని నిర్దోషులుగా ఎంచుతాడు.
[12] గనుక నేను ఆయనకు గొప్పవారితో వంతు పంచియిస్తాను. ఆయన బలాఢ్యులతో రాబడి విభాగించుకొంటాడు. ఎందుకంటే, ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. ఆయనను అక్రమకారులలో ఒకడని ఎంచడం జరిగింది. ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ, అక్రమకారులకోసం విన్నపం చేశాడు.