[1] ఇదిగో వినండి! యెహోవా హస్తం రక్షించలేనంత కురుచ కాలేదు! ఆయన చెవులు వినలేనంత మందం కాలేదు!
[2] మీ అపరాధాలు మీకూ మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు.
[3] మీ చేతులు రక్తంచేత, మీ వ్రేళ్ళు అపరాధాలచేత అపవిత్రమయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుకలు కుటిలమైన మాటలు పలుకుతాయి.
[4] ఎవడూ న్యాయంగా దావా చేయడం లేదు, ఎవడూ నిజాయితీతో వ్యాజ్యెమాడడం లేదు. అందరూ వట్టి కబుర్లమీద ఆధారపడి, మోసంగా మాట్లాడుతారు. చెడుగును గర్భం ధరించి అపరాధాన్ని కంటారు.
[5] వాళ్ళు మిణ్ణాగుల గుడ్లను పొదుగుతారు, సాలెపురుగు గూడు నేస్తారు. ఆ గుడ్లు తినేవాళ్ళు చచ్చిపోతారు. వాటిలో ఒకటి పగిలితే విష సర్పం బయటికి వస్తుంది.
[6] వాళ్ళ సాలెగూడు వాళ్ళకు వస్త్రం కాబోదు. వాళ్ళు నేసినదానితో కప్పుకోలేరు. వాళ్ళ పనులు పాపిష్టి పనులు. వాళ్ళు చేతులతో దౌర్జన్యం చేస్తారు.
[7] వాళ్ళ పాదాలు అపరాధం చేయడానికి పరుగెత్తుతూ ఉన్నాయి. నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి అవి వేగిరపడుతూ ఉన్నాయి. వాళ్ళ తలంపులు పాపిష్ఠి తలంపులు. వాళ్ళ త్రోవలలో నాశనం, ధ్వంసం ఉన్నాయి.
[8] శాంతిమార్గం వాళ్ళకు ఏమీ తెలియదు. వాళ్ళ నడతలో న్యాయం కనబడదు. వాళ్ళు వంకర మార్గాలను కల్పించుకొన్నారు. ఆ మార్గాలలో నడిచేవాళ్ళకు శాంతి కలగదు.
[9] అందుచేత న్యాయం మాకు దూరంగా ఉంది. నీతినిజాయితీ మమ్మల్ని అందుకోవడం లేదు. వెలుగు కోసం చూస్తూ ఉన్నాం గాని, అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం గాని, అంధకారంలోనే నడుస్తూ ఉన్నాం.
[10] గుడ్డివారిలాగా గోడకోసం తడవులాడుతూ, కళ్ళు లేని వారిలాగా తడవులాడుతూ ఉన్నాం. మధ్యాహ్న కాలంలో మునిచీకటి అయినట్టు కాలు జారి పడుతున్నాం. బలిసిన వాళ్ళమధ్య మేము చచ్చినవాళ్ళలాగా ఉన్నాం.
[11] మేమందరమూ ఎలుగుబంట్లలాగా ‘గుర్రు’ మంటున్నాం. గువ్వలలాగా దుఃఖరావం చేస్తున్నాం. న్యాయంకోసం చూస్తూ ఉన్నాం గాని, అది చేకూరడం లేదు. విముక్తికోసం చూస్తూ ఉన్నాం గాని, అది మాకు దూరంగా ఉంది.
[12] నీ ఎదుట మా అక్రమకార్యాలు అనేకం. మా అపరాధాలు మామీద సాక్ష్యం పలుకుతున్నాయి. మా అక్రమకార్యాలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, మా దోషాలు మాకు తెలిసే ఉన్నాయి –
[13] యెహోవామీద తిరుగుబాటు, ద్రోహం చేశాం. మా దేవునినుంచి తొలగిపోయాం. దౌర్జన్యాన్నీ అవిధేయతనూ ప్రోత్సహించాం. ఆంతర్యంలో కల్పించుకొన్న అబద్ధాలు చెప్పాం.
[14] గనుక న్యాయానికి ఆటంకం కలిగింది. ధర్మం దూరంగా నిలిచి ఉంది. సత్యం వీధులలో పడివుంది. నిజాయితీ లోపలికి రాలేకపోతున్నది.
[15] విశ్వసనీయత ఇక్కడ లేదు. చెడుగును విసర్జించేవాడెవడైనా దోపిడీకి గురి అవుతాడు. న్యాయం జరగకపోవడం చూచి యెహోవా నొచ్చుకొన్నాడు.
[16] ప్రజలలో వారికోసం విన్నపం చేసే ఏ మనిషీ లేకపోవడం చూశాను. అది ఆయనకు ఘోరం అనిపించింది. అందుచేత తన సొంత హస్తం ఆయనకు విజయం చేకూర్చింది. తన న్యాయం ఆయనకు ఆధారంగా ఉంది.
[17] న్యాయాన్ని వక్షానికి కవచంగా ధరించుకొన్నాడు. విముక్తిని శిరస్త్రాణంగా ధరించుకొన్నాడు. ప్రతీకారమనే దుస్తులు వేసుకొన్నాడు. ఆసక్తిని పైవస్త్రంగా వేసుకొన్నాడు.
[18] వాళ్ళు చేసినవాటి ప్రకారం ఆయన ప్రతీకారం చేస్తాడు. తన శత్రువులకు ఆగ్రహం చూపుతాడు. తన విరోధులకు ప్రతిక్రియ చేస్తాడు. ద్వీపవాసులకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.
[19] పడమటి దిక్కున ఉన్నవారికి యెహోవా పేరుపట్ల భయభక్తులు కలుగుతాయి. ఆయన వైభవం అంటే ప్రొద్దు పొడిచేదిక్కున ఉన్నవారికి భయభక్తులు కలుగుతాయి. యెహోవా ఊపిరికి కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు.
[20] “విమోచకుడు సీయోనుకు వస్తాడు. యాకోబు వంశంవారిలో తమ అక్రమకార్యాలనుంచి నావైపు తిరిగేవారి దగ్గరికి వస్తాడు” అని యెహోవా అంటున్నాడు.
[21] “నేను వారితో చేసే ఒడంబడిక ఇది: నీమీద ఉన్న నా ఆత్మ ఎప్పుడూ తొలగిపోడు. నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోటినుంచీ నీ పిల్లల నోటినుంచీ నీ పిల్లల పిల్లల నోటినుంచీ ఆ కాలం మొదలుకొని ఎప్పటికీ తొలగిపోవు. ఇది యెహోవా వాక్కు.”