[1] యెహోవా, నీవే నా దేవుడివి. నేను నిన్ను కీర్తిస్తాను, నీ పేరును స్తుతిస్తాను. నీవు అద్భుతాలు చేశావు. చాలా కాలంక్రిందచేసిన ఆలోచనలు ఎంతో నమ్మకంగా నెరవేర్చావు.
[2] నీవు నగరాన్ని శిథిలాలుగా, ప్రాకారాలున్న పట్టణాన్ని పాడుగా చేశావు. విదేశీయుల భద్రమైన స్థలాన్ని పట్టణంగా ఉండకుండా చేశావు. దానిని మళ్ళీ కట్టడం ఎన్నడూ జరగదు.
[3] గనుక బలమైన జనాలు నిన్ను గౌరవిస్తాయి. నీవంటే క్రూర జనాల పట్టణాలకు భయం వేస్తుంది.
[4] క్రూరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానలాగా ఉంది, అయితే నీవు బీదలకు ఆశ్రయంగా, బాధలో ఉన్న పేదవారికి ఆశ్రయంగా ఉన్నావు. గాలివాన తగలకుండా నిలవ నీడగా ఉన్నావు.
[5] ఎండిన దేశాన్ని వేడిమి అణచివేసే విధంగా నీవు విదేశీయుల ఘోషను అణచివేస్తావు. మబ్బు నీడ ఎండను అణచివేసే విధంగా క్రూరుల పాటలను అణచివేస్తావు.
[6] ఈ కొండమీద సేనలప్రభువు యెహోవా అన్ని జనాలకోసం క్రొవ్వినవాటితో విందు చేస్తాడు. పాత ద్రాక్షరసంతో, మూలుగులున్న మేలిరకమైన మాంసం ముక్కలతో, మేలిరకమైన ద్రాక్షరసంతో విందు చేస్తాడు.
[7] జనాలన్నిటినీ కప్పుతూ ఉన్న ముసుకునూ అన్ని జాతులమీద పరచి ఉన్న తెరనూ ఈ కొండమీద ఆయన నాశనం చేస్తాడు.
[8] ఇంకెన్నడూ ఉండకుండా మృత్యువును ఆయన దిగమ్రింగివేస్తాడు. యెహోవాప్రభువు ప్రతి ఒక్కరి ముఖంమీదనుంచీ కన్నీటి బిందువులను తుడిచివేస్తాడు. భూమిమీదనుంచి తన ప్రజల నిందను తొలగిస్తాడు. ఇలా జరుగుతుందని యెహోవా అన్నాడు.
[9] ఆ రోజున వారు ఇలా అంటారు: “ఇదిగో, ఈయన మన దేవుడు. మనలను రక్షిస్తాడని ఆయన కోసం నమ్మకంతో ఎదురు చూశాం. ఈయన యెహోవా. ఆయనకోసం నమ్మకంతో ఎదురు చూశాం. ఆయన మనల్ని రక్షించినందుచేత సంతోషించి ఆనందిద్దాం.”
[10] యెహోవా ఈ కొండమీద చెయ్యి ఉంచుతాడు. అయితే పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడే విధంగా మోయాబును ఆయన పాదాలు త్రొక్కుతాయి.
[11] ఈతగాడు ఈదడానికి చేతులు చాపే విధంగా వాళ్ళు దానిమధ్య చేతులు చాపుతారు. అయితే వాళ్ళ చేతులు ఎంత యుక్తిగా పని చేసినా యెహోవా వాళ్ళ గర్వాన్ని అణచివేస్తాడు.
[12] కోటలున్న నీ ఎత్తయిన గోడలను ఆయన పడద్రోస్తాడు. వాటిని నేలకు కూలగొట్టి దుమ్ముపాలు చేస్తాడు.