Skip to content
Opens in a new window

[1] యెహోవా ఇలా అంటున్నాడు: “నేను మీ తల్లిని పంపివేస్తూ ఇచ్చిన విడాకులెక్కడా? నా అప్పుల వాళ్ళలో ఎవడికి మిమ్మల్ని అమ్మివేశాను? మీ అపరాధాల కారణంగానే మీరు అమ్ముడుపోయారు. మీ అక్రమ కార్యాలకారణంగానే మీ తల్లిని పంపివేయడం జరిగింది.

[2] నేను వచ్చినప్పుడు ఎవడూ లేకపోవడమెందుకు? నేను పిలిచినప్పుడు ఎవడూ జవాబివ్వలేదేమిటి? నా చేయి విడుదల చేయలేనంత కురుచగా ఉందా? విడిపించడానికి నాకు బలం లేదా? నా గద్దింపుచేత సముద్రాన్ని ఇంకిపోయేలా చేయగలను. నదులను ఎడారిగా చేయగలను. అప్పుడు నీళ్ళు లేక వాటి చేపలు చచ్చిపోయి, కంపుకొడతాయి.

[3] ఆకాశాలను చీకటి కమ్మేలా చేస్తాను. అవి గోనెపట్ట ధరించేలా చేస్తాను.”

[4] “అలసిపోయినవాణ్ణి మాటలచేత ఆదరించడం నేను తెలుసుకొనేందుకు యెహోవా నాకు నేర్పుగల నోరు ఇచ్చాడు. ప్రతి ఉదయమూ ఆయన నన్ను మేలుకొలుపుతాడు. శిష్యుడు వినే విధంగా నేను వినాలని నా చెవిని మేలుకొలుపుతాడు.

[5] యెహోవాప్రభువు నా చెవిని తెరచాడు. నేను తిరగబడలేదు, వెనక్కు తీయలేదు.

[6] నన్ను కొట్టేవాళ్ళకు నా వీపును అప్పగించాను, నా గడ్డం పెరికివేసేవాళ్ళకు నా చెంపలను అప్పగించాను. వాళ్ళు నా ముఖంమీద ఉమ్మివేసినప్పుడు, నిందించినప్పుడు నేను ముఖం దాచుకోలేదు.

[7] యెహోవా ప్రభువు నాకు సహాయం చేసేవాడు, గనుక నేను సిగ్గుపడలేదు. నాకు తలవంపులు కలగవని తెలిసి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా ఉంచుకొన్నాను.

[8] నేను నిర్దోషినని నిరూపించేవాడు దగ్గరగా ఉన్నాడు. ఎవడు నామీద నేరం మోపుతాడు? మనం ముఖాముఖిగా నిలబడుదాం. ఫిర్యాదీ ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానియ్యి.

[9] యెహోవాప్రభువు నాకు సహాయం చేస్తాడు. దోషినని నాకు ఎవడు తీర్పు తీరుస్తాడు? అలాంటివాళ్ళంతా బట్టలాగా పాతగిలిపోతారు. చిమ్మట వాళ్ళను తినివేస్తుంది.

[10] “మీలో ఎవరు యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఆయన సేవకుడి మాట వింటారు? ఏమీ వెలుగు లేక చీకటిలో నడిచే వ్యక్తి యెహోవా పేరుమీద నమ్మకముంచాలి. అవును, తన దేవునిమీద ఆధారపడాలి.

[11] ఇదిగో, నిప్పు రాజబెట్టేవాళ్ళారా! కొరకంచులను మీ చుట్టూ పట్టుకొనే వాళ్ళారా! మీ నిప్పు వెలుగులో నడవండి. రాజబెట్టిన కొరకంచుల వెలుగులో నడవండి. నా చేతివల్ల మీరు పొందబోయేదేమిటంటే, మీరు వేదనతో పడుకొంటారు.

యెషయా — Chapters