Skip to content
Opens in a new window

[1] యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది. దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.

[2] దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.

[3] యెహోవా ముందర అగ్నిబయలు వెళ్తూ ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.

[4] ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది. ప్రజలు దాన్ని చూచి భయపడతారు.

[5] యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగి పోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగి పోతాయి.

[6] ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి. ప్రతి మనిషీ దేవును మహిమను చూచును గాక!

[7] మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు. వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు. కానీ ఆ ప్రజలు యిబ్బంది పడుతారు. వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.

[8] సీయోనూ, విని సంతోషించుము! యూదా పట్టణములారా, సంతోషించండి! ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.

[9] సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు. ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.

[10] యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు. కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.

[11] మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.

[12] మంచి మనుష్యులారా యెహోవాయందు ఆనందించండి. ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.

కీర్తనల గ్రంథము — Chapters