Skip to content
Opens in a new window

[1] యెహోవా, నా ప్రార్థన వినుము. నా ప్రార్థన ఆలకించుము. అప్పుడు నా ప్రార్థనకు జవాబుయిమ్ము. నిజంగా నీవు మంచివాడవని, నమ్మకమైన వాడవని నాకు చూపించుము.

[2] నేను నీ సేవకుడను, నాకు తీర్పు తీర్చవద్దు. నీ ఎదుట బతికియున్న మనుష్యుడెవడూ నీతిమంతునిగా ఎంచబడడు.

[3] కానీ నా శత్రువులు నన్ను తరుముతున్నారు. వారు నా జీవితాన్ని మట్టిలో కుక్కివేశారు. ఆ శాశ్వత చీకటి సమాధిలోనికి నన్ను తోసి వేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.

[4] నాలోవున్న నా ఆత్మ దిగజారిపోయింది. నేను నా ధైర్యాన్ని పోగొట్టుకొంటున్నాను.

[5] కానీ చాలకాలం క్రిందట జరిగిన విషయాలను నేను జ్ఞాపకం చేసికొంటాను. నీ క్రియలన్నిటినీ నేను ధ్యానిస్తున్నాను. యెహోవా, నీవు నీ శక్తితో చేసిన అనేక అద్భుత కార్యాలను గూర్చి నేను ధ్యానిస్తున్నాను.

[6] యెహోవా, నేను నా చేతులు ఎత్తి నిన్ను ప్రార్థిస్తున్నాను. ఎండిన భూమి వర్షం కోసం ఎదురు చూచినట్టుగా నేను నీ సహాయం కోసం ఎదురు చుస్తున్నాను.

[7] యెహోవా, త్వరపడి నాకు సమాధానం యిమ్ము! నేను నా ధైర్యం పోగొట్టుకొన్నాను. నా నుండి తిరిగిపోకు, నన్ను చావనివ్వకుము. సమాధిలో చచ్చిపడిన శవాల్లా ఉండనీయకుము.

[8] యెహోవా, ఈ ఉదయం నీ నిజమైన ప్రేమను నాకు చూపించుము నేను నిన్ను నమ్ముకొన్నాను. సరియైన మార్గాన్ని నాకు చూపించుము. నేను నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను!

[9] యెహోవా, కాపుదల కోసం నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.

[10] నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము. నీవు నా దేవుడవు.

[11] యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు నన్ను జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.

[12] యెహోవా, నీ ప్రేమ నాకు చూపించి, నన్ను చంపటానికి చూస్తున్న నా శత్రువులను ఓడించుము. ఎందుకంటే నేను నీ సేవకుడను.

కీర్తనల గ్రంథము — Chapters