Skip to content
Opens in a new window

[1] పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.

[2] నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు. మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.

[3] నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లు కొన్నారు. కానీ వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

[4] నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు. యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.

[5] యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు. యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు. బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.

[6] శత్రువు పని అంతం అయిపోయింది. యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు. ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

[7] అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.

[8] భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.

[9] అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు. ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు. యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

[10] నీ నామం తెలిసిన ప్రజలు నీమీద విశ్వాసం ఉంచాలి. యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

[11] సీయెనులో నివసిస్తున్న ప్రజలారా మీరు యెహోవాకు స్తుతులు పాడండి. యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.

[12] సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు. మరి యెహోవా వారిని మరచిపోలేదు.

[13] దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము. నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము. ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.

[14] తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను. నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

[15] యూదులు కాని ఆ ప్రజలు, ఇతర ప్రజలను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు. కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు. ఆ మనుష్యులు ఇతర ప్రజలను పట్టడానికి వలలు మాటున పెట్టారు. కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.

[16] యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు. యెహోవా చేసిన దాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్

[17] దేవుని మరచే ప్రజలు దుష్టులు. ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.

[18] ఆ పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది. కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

[19] యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము. వారే శక్తిగలవారు అని ప్రజలను తలచనీయకుము.

[20] ప్రజలకు పాఠం నేర్పించు. వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనల గ్రంథము — Chapters