Skip to content
Opens in a new window

[1] దేవాది దేవుడు యెహోవా మాట్లాడాడు. సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.

[2] సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.

[3] మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు. ఆయన యెదుట అగ్ని మండుతుంది. ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.

[4] తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని, కింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.

[5] “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి. వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని చెప్పారు.

[6] అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి. ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.

[7] దేవుడు చెబతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి. ఇశ్రాయేలు ప్రజలారా మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.

[8] నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు. ఇశ్రాయేలు ప్రజలారా మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.

[9] మీ ఇంటినుండి యెద్దులను తీసుకోను. మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.

[10] ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం. వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.

[11] కొండల్లో వుండే ప్రతి పక్షి నాకు తెలుసు. పొలాల్లో చలించే ప్రతీదీ నా సొంతం

[12] నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.

[13] నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”

[14] దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి, దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.

[15] “ఇశ్రాయేలు ప్రజలారా మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి! నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”

[16] దుర్మార్గులతో దేవుడు చెబతున్నాడు, “నా న్యాయ విధులను చదువుటకు నా ఒడంబడికకు బద్దులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?

[17] కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు. నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.

[18] మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడుతారు. వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.

[19] మీరు చెడు సంగతులు చెబతారు, అబద్ధాలు పలుకుతారు.

[20] మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబతారు. మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.

[21] మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు. కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను. మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.

[22] నేను మిమ్ములను చీల్చివేయకముందే, దేవుని మరచిన జనాంగమైన మీరు, ఈ విషయంను గూర్చి ఆలోంచించాలి. అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.

[23] ఒక వ్యక్తి కృతజ్ఞతా అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు. నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

కీర్తనల గ్రంథము — Chapters