[1] యెహోవా గొప్పవాడు. మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
[2] దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎతైనది. అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది. సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం. అది మహారాజు పట్టణం.
[3] ఇక్కడ ఆ పట్టణంలోని, భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
[4] ఒకప్పుడు రాజులు కొందరు సమావేశ మయ్యారు. వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు. వారంతా కలసి ముందుకు వచ్చారు.
[5] ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు, వారు బెదరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
[6] ఆ రాజులందరికీ భయం పట్టుకొంది. ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
[7] దేవా, బలమైన తూర్పుగాలితో తర్షీషు ఓడలను బద్దలు చేశావు.
[8] మేము ఏమి విన్నామో దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో చూశాము, మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో. దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
[9] దేవా, నీ ప్రేమా కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
[10] దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు. భూలోక మంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
[11] సీయోను పర్వతం సంతోషిస్తుంది. మరియు యూదా నగరాలు ఆనందంగా వున్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
[12] సీయోను చుట్టూ తిరుగుతూ ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
[13] ఎత్తైన గోడలు చూడండి. సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి. అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
[14] దేవుడు నిజంగా ఎల్లప్పుడూ శాశ్వతంగా మన దేవుడై ఉంటాడు. ఆయనే మనలను శాశ్వతంగా నడిపిస్తాడు. మరియు ఆయన ఎన్నటికీ మరణించడు!