Skip to content
Opens in a new window

[1] న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు. మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.

[2] లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు. ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.

[3] ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు. పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.

[4] వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు. వినతలచని తాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.

[5] తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు. ఆ దుర్మార్గులు అలాన్నారు.

[6] యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు. కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.

[7] ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక. బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.

[8] మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక. చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.

[9] కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా కాలి పోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

[10] మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు. ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.

[11] అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది. లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

కీర్తనల గ్రంథము — Chapters