Skip to content
Opens in a new window

[1] యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!

[2] యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను. నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!

[3] దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.

[4] ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను. నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”

[5] యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.

[6] పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు. “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.

[7] యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు ఆ దేవ దూతులు భయపడి యెహోవాను గౌరవిస్తారు. వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.

[8] సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగల వారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.

[9] ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు. దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.

[10] దేవా, నీవు రహబును ఓడించావు. నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.

[11] దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వంనీదే. ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.

[12] ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు. తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.

[13] దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం నీదే!

[14] సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.

[15] దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.

[16] నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది. వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.

[17] నీవే వారి అద్భుత శక్తివి, వారి శక్తి, నీ నుండే లభిస్తుంది.

[18] యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.

[19] కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.

[20] నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.

[21] నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.

[22] ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.

[23] అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.

[24] ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.

[25] ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో ఉంచుతాడు.

[26] ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’ అని అతడు నాతో చెబతాడు.

[27] మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను. భూ రాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.

[28] ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది. అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.

[29] అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.

[30] అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే, నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.

[31] ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞాలను ఉల్లంఘించి, నా ఆదేశాలను పాటించకపోతే

[32] అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.

[33] కానీ వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను. నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.

[34] దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను. మా ఒడంబడికను నేను మార్చను.

[35] నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్ధానం చేసాను. మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.

[36] దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.

[37] చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది. ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

[38] కానీ దేవా, ఏర్పరచబడిన నీ రాజు మీద నీకు కోపం వచ్చింది. నీవు అతన్ని ఒంటరి వానిగా విడిచి పెట్టావు.

[39] నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు. రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.

[40] రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు. అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.

[41] రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు. దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.

[42] రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు. అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.

[43] దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు. నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.

[44] అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.

[45] అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు. నీవు అతన్ని అవమానించావు.

[46] యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా? నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా? ఎంత కాలం యిలా సాగుతుంది?

[47] నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము. అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.

[48] ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు. ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.

[49] దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ? దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.

[50] ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది. ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.

[52] యెహోవాను శాశ్వతంగా స్తుతించండి. ఆమేన్, ఆమేన్!

కీర్తనల గ్రంథము — Chapters