[1] నా దేవా, నా రాజా నిన్ను నేను స్తుతిస్తాను. నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
[2] ప్రతిరోజూ నిన్న నేను స్తుతిస్తాను. ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
[3] యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు. ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
[4] యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు. నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
[5] ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
[6] యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు. నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
[7] నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు. యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.
[8] యెహోవా దయగల వాడు, కరుణగల వాడు. యెహోవా సహనంగల వాడు, ప్రేమ పూర్ణుడు.
[9] యెహోవా, అందరి యెడలా మంచివాడు. దేవుడ చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
[10] యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి. నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
[11] ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు. నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
[12] కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
[13] యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. నీవు శాశ్వతంగా పాలిస్తావు.
[14] పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు. కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
[15] యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం సీవైపు చూస్తాయి. సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
[16] యెహోవా, నీవు నీ గుప్పిడి విప్పి, జీవిస్తున్న సకల ప్రాణులకూ వాటికి కావాల్సినవన్నీ యిస్తావు.
[17] యెహోవా చేసే ప్రతీదీ మంచిది. యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమ చూపిస్తాడు.
[18] యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు. యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
[19] ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు. యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు. మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
[20] యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు. దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
[21] నేను యెహోవాను స్తుతిస్తాను! ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!