Skip to content
Opens in a new window

[1] మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.

[2] “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబతాను.

[3] దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.

[4] కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు. పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు. దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.

[5] రాత్రివేళ నీవు దేనికి భయపడవు. పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.

[6] చీకటిలో దాపురించే రోగాలకు గాని మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.

[7] నీ పక్కన వేయిమంది, నీ కుడిచేతి పక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు. నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.

[8] ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా నీకు కనబడుతుంది.

[9] ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక. సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.

[10] కీడు ఏమీ నీకు జరగదు. నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.

[11] ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.

[12] నీ పాదం రాయికి తగులకుండా దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.

[13] సింహాల మీద, విషసర్పాల మీద నడిచే శక్తి నీకు ఉంటుంది.

[14] యెహోవా చెబతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.

[15] నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.

[16] నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను. నేను వాళ్లను రక్షిస్తాను.”

కీర్తనల గ్రంథము — Chapters