Skip to content
Opens in a new window

[1] దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్దరించుము.

[2] భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతోంది. దయచేసి దాన్ని బాగు చేయుము.

[3] నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు. తగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.

[4] నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.

[5] నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు, నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.

[6] దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.

[7] గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. యూదా నా రాజదండము.

[8] మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసేబానిసగా ఉంటుంది. ఫిలిప్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”

[9] బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?

[10] దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.

[11] దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము. మనుష్యులు మాకు సహాయం చేయలేరు.

[12] కాని దేవుని సహాయంతో మేము జయించగలం. దేవుడు మా శత్రువులను ఓడించగలడు.

కీర్తనల గ్రంథము — Chapters