Skip to content
Opens in a new window

[1] యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక కొత్త కీర్తన పాడుడి! సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!

[2] యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి. శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.

[3] దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి. దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.

[4] యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు. ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.

[5] ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే. కానీ యెహోవా ఆకాశాలను సృష్టించాడు.

[6] ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.

[7] వంశములారా రాజ్యములారా యెహోవా మహిమకు, స్తుతి కీర్తనలు పాడండి.

[8] యెహోవా నామాన్ని స్తుతించండి. మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.

[9] యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి! భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.

[10] యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి! కనుక ప్రపంచం నాశనం చేయబడదు. యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.

[11] ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనందించుము! సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!

[12] పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి! అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.

[13] యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి. ప్రపంచాన్ని పాలించుటకు యెహోవా వస్తున్నాడు. న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.

కీర్తనల గ్రంథము — Chapters