Skip to content
Opens in a new window

[1] సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను. దేవా నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.

[2] నా దేవా నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను. రాత్రి అంతా నీకోసం నా చేయిచాపి ఉన్నాను. నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.

[3] నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు, నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.

[4] నీవు నన్ను నిద్రపోనియ్యవు. నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలపరపడి పోయాను.

[5] గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను. చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.

[6] రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను. నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.

[7] “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా? ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?

[8] దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా? ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?

[9] కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా? ఆయన జాలి కోపంగా మార్పబడిందా” అని నాకు అనిపిస్తుంది.

[10] అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా? అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.

[11] యేహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను. దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.

[12] నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను. ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.

[13] దేవా, నీ మార్గాలు పవిత్రం. దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.

[14] నీవు ఆద్భుత కార్యాలు చేసిన దేవుడివి. నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.

[15] నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు. యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.

[16] దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి. లోతైన జలాలు భయంతో కంపించాయి.

[17] దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి. ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి. అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.

[18] పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి. మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది. భూమి కంపించి వణికింది.

[19] దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు. కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.

[20] అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు మోషేను, అహరోనును నీవు వాడు కొన్నావు.

కీర్తనల గ్రంథము — Chapters