Skip to content
Opens in a new window

[1] “యెహోవా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!” అతడీలాగన్నాడు.

[2] యెహోవా నా దండ, నా కోట, నా రక్షకుడు. నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, ఆయనే శక్తి నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

[3] యెహోవాకు నేను మొరపెడ్తాను. యెహోవా స్తుతించబడుటకు అర్హుడు మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.

[4] నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు. మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి. మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి. నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయ పెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.

[6] చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను. నేను నా దేవుని ప్రార్థించాను. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు. సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.

[7] యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి. ఎందుకంటే ప్రభువు కోపించాడు.

[8] ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది. యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.

[9] యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు. ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.

[10] ఎగిరే కెరూబులు మీద ఆయన స్వారీ చేశాడు. ఆయన గాలుల మీద పై కెగిరాడు.

[11] యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మైఘంలో ఆయన మరుగైయున్నాడు. దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.

[12] అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది. అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.

[13] యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.

[14] యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు, అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.

[15] యెహోవా, నీవు బలంగా మాట్లాడావు, మరియు నీవు నీ నోటినుండి బలమైన గాలిని ఊదావు. నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము. భూమి పునాదులను మేము చూడగలిగాము.

[16] పై నుండి యెహోవా కిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయననన్ను బయటకు లాగాడు.

[17] నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.

[18] నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు.

[19] యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు. ఆయన నన్నుక్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.

[20] నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు.

[21] నేను యెహోవాను అనుసరించాను. నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చెయలేదు.

[22] యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు.

[23] ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను. నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను.

[24] నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు.

[25] యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మ దగినవాడవు. మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు.

[26] యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైన వాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు. కానీ, గర్విష్ఠులను, టక్కరి వాళ్లను నీవు అణచివేస్తావు.

[27] యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. కానీ గర్విష్టులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు.

[28] యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.

[29] యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను. నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను.

[30] దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.

[31] యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు. మన దేవుడు తప్ప మరో బండ లేదు.

[32] దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.

[33] దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె వేగంగా ఉంచుతాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు.

[34] యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు. ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు.

[35] దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి. నీ కుడిచేతితో నన్ను బలపరుచుము. నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది.

[36] నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు.

[37] నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు.

[38] నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు.

[39] దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము. నా శత్రువులంతా నా యెదుట పడిపోయేట్టు చేయుము.

[40] యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను.

[41] నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కానీ ఎవ్వరూ వారికి సహాయం చేసేందకు రాలేదు. వారు యెహోవాకు కూడా మొరపెట్టారు. కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు.

[42] నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీ ధుల బురదగా పారవేసాను.

[43] నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు.

[44] ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు.

[45] ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు.

[46] యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.

[47] నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు.

[48] యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు.

[49] కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను.

[50] యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు.

కీర్తనల గ్రంథము — Chapters