[1] యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము. ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
[2] యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము. ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
[3] యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి ఆతిశయించు. యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
[4] బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి. సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
[5] యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
[6] దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు. దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
[7] యెహోవా మన దేవుడు. యెహోవా సర్వలోకాన్నీ పాలిస్తాడు.
[8] దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి. 1,000 తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
[9] దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు. ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
[10] యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
[11] “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.” అని దేవుడు చెప్పాడు.
[12] అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు. మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
[13] దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి వారు ప్రయాణం చేసారు.
[14] కానీ యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు. వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
[15] “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు. నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
[16] దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు. ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
[17] అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు. యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
[18] యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు. అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
[19] యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు అతడు బానిసగా యోసేపు చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
[20] కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు. అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
[21] అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు. రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
[22] యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు. పెద్ద మనుష్యులకు యోసేపు నేర్చించాడు.
[23] తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు. యాకోబు హాము దేశంలో నివసించాడు.
[24] యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది. వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
[25] కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు. ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
[26] కనుక దేవుడు తన సేవకుడైన మోషేను, తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
[27] హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
[28] దేవుడు కటిక చీకటిని పంపించాడు. కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
[29] కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు. వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
[30] ఆ దేశం కప్పలతో నింపివేయబడింది. రాజు గదులలో కూడ కప్పలు ఉన్నాయి.
[31] దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు, దోమలు వచ్చాయి. అన్నిచోట్లా అవే ఉన్నాయి.
[32] దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు. ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
[33] ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు. వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
[34] దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు వచ్చాయి. అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
[35] మిడుతలు, పచ్చిగడ్డి మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి. నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
[36] అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్నీ దేవుడు చంపేశాడు. వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
[37] అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు. వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు. దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
[38] దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది. ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
[39] దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు. రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
[40] ప్రజలు భోజనం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు. దేవుడ వారికి ఆకాశం నుండి సమృద్ధిగా రొట్టెను యిచ్చాడు.
[41] దేవుడు బండను చిల్చగా నీళ్లు ఉబకుతూ వచ్చాయి. ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.
[42] దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు. దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
[43] దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
[44] అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
[45] దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు. వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు. యెహోవాను స్తుతించండి.