Skip to content
Opens in a new window

[1] యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కోపగించి నన్ను శిక్షించవద్దు.

[2] యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.

[3] నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?

[4] యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.

[5] చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

[6] యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను. నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుచున్నాయి. నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.

[7] నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను అలసటగాను ఉన్నాయి.

[8] చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.

[9] యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

[10] నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు. వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

కీర్తనల గ్రంథము — Chapters