Skip to content
Opens in a new window

[1] రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి. నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.

[2] నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు! నీ పెదవులనుండి దయ వెలువడుతుంది కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.

[3] నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరుడువలె, మహిమను, ఘనతను ధరించుము.

[4] నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము. అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.

[5] నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.

[6] దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండమయి ఉంది.

[7] నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును నీవు ద్వేషిస్తావు. కనుక దేవా, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు.

[8] నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగి, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి. నిన్ను సంతోషపరచుటకు దంతం పొదుగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.

[9] నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమారైలున్నారు. నీ పెండ్లి కుమారై ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.

[10] కుమారీ, నా మాట వినుము. నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్నీ మరచిపోకుము.

[11] రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే నీకు కొత్త భర్తగా ఉంటాడు. నీవు ఆయన్ని ఘనపరుస్తావు.

[12] తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు. నీ కోసం ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.

[13] రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది. ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.

[14] ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది. ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.

[15] సంతోషంతో నిండిపోయి వారు వస్తారు. సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.

[16] రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు. దేశవ్యాప్తంగా వారిని రాజులుగా నీవు చేస్తావు.

[17] నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను. శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

కీర్తనల గ్రంథము — Chapters