[1] యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము.
[2] యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
[3] పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది. నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది.
[4] నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను.
[5] నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.
[6] అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.
[7] నేను నిద్రపోలేను. పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను.
[8] నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు.
[9] నా అధిక విచారమే నా భోజనం. నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి.
[10] ఎందకంటే, నీవు నా మీద కోపగించావు. యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను కిందకు విసిరేశావు.
[11] సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయి పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను.
[12] ఆయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది.
[13] నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోనుయెడల దయగా ఉండే సమయం వస్తూంది.
[14] యెరుషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.
[15] జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు.
[16] ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు.
[17] దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు.
[18] రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసి పెట్టు. అప్పుడు. భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
[19] యెహోవా పైవున్న తన పవిత్ర స్థానం నుండి కిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి కింద భూమిని చూస్తాడు.
[20] ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు.
[21] సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబతారు. వారు యెహోవా నామాన్ని యోరూషలేములో స్మరిస్తారు.
[22] జనసమూహములు కలిసి పోగుచేయ బడునప్పుడు రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
[23] నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా చేయబడింది.
[24] కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.
[25] చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు.
[26] ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి. కానీ నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చి వేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి.
[27] కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వతంగా జీవిస్తావు!
[28] ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.”