Skip to content
Opens in a new window

[1] యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. మన దేనునికి స్తుతులు పాడండి. ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.

[2] యెహోవా యెరూషలేమును నిర్మించాడు. బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.

[3] పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు.

[4] దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు. వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.

[5] మన ప్రభువు చాలా గొప్పవాడు ఆయన చాలా శక్తిగలవాడు. ఆయన పరజ్ఞానానికి పరిమితం లేదు.

[6] పేదలను యెహోవా బలపరుస్తాడు. కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.

[7] యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. స్వరమండలాలతో మన దేవుని స్తుతించండి.

[8] దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు. భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు. పర్వతాల మీద దేవుడు గడ్డని మొలిపిస్తాడు.

[9] జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు. పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.

[10] యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.

[11] యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.

[12] యెరూషలేమా, యెహోవాను స్తుతించుము. సీయోనూ, నీ దేవుని స్తుతించుము!

[13] యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బల పరుస్తాడు. నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.

[14] నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు. ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.

[15] దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. దానికి వెంటనే అది లోబడుతుంది.

[16] నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచుకురిసేటట్టు దేవుడు చేస్తాడు. ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.

[17] దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లను పడేలా చేస్తాడు. ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.

[18] అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది. మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

[19] దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.

[20] దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు. ఇతర మనుష్యులకు దేవుడ తన న్యాయ చట్టం ఉపదేశించలేదు. యెహోవాను స్తుతించండి!

కీర్తనల గ్రంథము — Chapters