Skip to content
Opens in a new window

[1] నేను నిరుపేద, నిస్సహాయుణ్ణి. యోహావా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.

[2] యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.

[3] నా ప్రభువా నా మీద దయ చూపించుము. రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.

[4] ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.

[5] ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.

[6] యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే నా ప్రార్థనలు ఆలకించుము.

[7] యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.

[8] దేవా, నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.

[9] ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.

[10] దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు. నీవు మాత్రమే దేవుడవు.

[11] యెహోవా నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము.

[12] దేవా, నా ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.

[13] దేవా నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.

[14] దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.

[15] ప్రభూ, నీవు, దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.

[16] దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.

[17] దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

కీర్తనల గ్రంథము — Chapters