[1] దేవా, నా ప్రార్థన ఆలకించుము. నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
[2] నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము. ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
[3] వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు. వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
[4] వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు. అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడ్డాడు.
[5] అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు. “వారు వారి ఉరులను పెడతారు.” వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని వారనుకొంటారు.
[6] మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు. మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతోకష్టం.
[7] కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
[8] దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు. కానీ దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు. ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు. అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
[9] దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు. వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు. ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
[10] మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి. వారు ఆయన్ని నమ్ముకోవాలి. మంచి మనుష్యులారా మీరంతా యెహోవాను స్తుతించండి.