Skip to content
Opens in a new window

[1] యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు. రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.

[2] దయచేసి నా ప్రార్థనలను గమనించుము. కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.

[3] నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను. మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.

[4] జీవించుటకు బహు బలహీనుడివలె చనిపోయిన మనిషివలె ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.

[5] మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను. నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను. నీనుండీ నీ జాగ్రత్తనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను. మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.

[6] యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు. నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.

[7] నీవు నా మీద కోపగించావు. నీవు నన్ను శిక్షించావు.

[8] నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు. నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.

[9] నా బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి. యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.

[10] యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు! దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

[11] చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు. చనిపోయిన వారు మృతులలోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.

[12] చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు. మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.

[13] యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. ప్రతి వేకువ ఝామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.

[14] యోహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు? నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?

[15] నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని. నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.

[16] యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు. శిక్ష నన్ను చంపేస్తుంది.

[17] నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. నా నొప్పులు, బాధల్లో నేను మునిగి పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.

[18] మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా నీవు చేశావు. చీకటి మాత్రమే నాకు మిగిలింది.

కీర్తనల గ్రంథము — Chapters