Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు. నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.

[2] నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి. గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.

[3] యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు? యెహోవా, ఇంకెన్నాళ్లు?

[4] ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?

[5] యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు. నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.

[6] మా దేశంలో నివసించే విధవరాండ్రను పరదేశస్తులను ఆ దుర్మార్గులు చంపుతారు. తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.

[7] వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు. జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబతారు.

[8] దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు. మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు? దుర్మార్గులారా, మీరు అవివేకులు మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.

[9] దేవుడు మన చెవులను చేశాడు. కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు. దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి. జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.

[10] ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు. ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.

[11] ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు. ప్రజలు గాలి వీచినట్లుగా వుంటారని దేవునికి తెలుసు.

[12] యెహోవా శిక్షించిన వాడు సంతోషంగా ఉంటాడు. సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.

[13] దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు. దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.

[14] యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.

[15] న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది. అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.

[16] దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు. చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.

[17] యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.

[18] నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు. కాని యెహోవా తన అనుచరుని బల పరిచాడు.

[19] నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను. కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.

[20] దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు. ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.

[21] ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు. అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.

[22] అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే. నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.

[23] ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు. వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.

కీర్తనల గ్రంథము — Chapters