Skip to content
Opens in a new window

[1] మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి. నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.

[2] సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి. యెహోవాకు పదితంతుల స్వర మండలాన్ని వాయించండి.

[3] ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆనంద గీతాన్ని అనందంగా పాడండి.

[4] దేవుని మాట సత్యం! ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.

[5] నీతి, న్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.

[6] యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది. భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.

[7] సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు. మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.

[8] భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి. ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.

[9] ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది. ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే అప్పుడు అది ఆగిపోతుంది.

[10] జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు. వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.

[11] అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది. ఆయన తలంపులు తర తరాలకు మంచివి.

[12] యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు. దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.

[13] యెహోవా పరలోకం నుండి కిందికి చూసాడు. మనుష్యులందరిని ఆయన చూశాడు.

[14] భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.

[15] ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు. ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.

[16] ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు. ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.

[17] యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు. తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.

[18] యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు, ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.

[19] ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే. ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.

[20] అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము. ఆయన మనకి సహాయం, మన డాలు.

[21] దేవుడు నన్ను సంతోషపరుస్తాడు, నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.

[22] యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము. కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

కీర్తనల గ్రంథము — Chapters