Skip to content
Opens in a new window

[1] అప్పుడు యోబు ఈవిధంగా జవాబిచ్చాడు:

[2] “నీవన్నది నిజమే అని నాకు తెలుసు – దేవుని దృష్టిలో మనిషి ఎలా న్యాయవంతుడు కాగలడు?

[3] మనిషి ఆయనతో వివాదం పెట్టుకోవాలంటే దేవుడు వేసే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా అతడు జవాబు చెప్పలేడు.

[4] దేవునిది వివేక హృదయం. ఆయన మహా బలాఢ్యుడు. ఆయనను ధిక్కరించి దెబ్బ తిననివాడెవ్వడు?

[5] పర్వతాలను వాటికి తెలియకుండానే తొలగించి వేస్తాడాయన. కోపంతో వాటిని బోర్ల తోస్తాడాయన.

[6] భూమిని కూడా దాని స్థానం నుంచి కదిలించివేస్తాడు. దాని స్తంభాలను ఊపివేస్తాడు.

[7] ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే పొద్దు పొడవదు. ఆయన నక్షత్రాలను కనబడకుండా చేస్తాడు.

[8] ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలంగా పరచేవాడు, సముద్రం అలలను అణగదొక్కేవాడు.

[9] స్వాతి, మృగశీర్షం, కృత్తిక నక్షత్రాలను ఆయనే సృజించాడు. దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే చేశాడు.

[10] ఎవరికీ గోచరం కాని విషయాలను ఆయన చేస్తున్నాడు. లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తున్నాడాయన.

[11] అడుగో, ఆయన నా ప్రక్కగానే నడుస్తూ ఉంటే నేనాయనను చూడలేకపోతున్నాను. నా దగ్గరగానే ఆయన పోతూవుంటే నేను గమనించలేకపోతున్నాను.

[12] ఆయన తీసుకుపోతూవుంటే ఆయనను వెనక్కు ఎవరు తీసుకురాగలరు? ‘నీవు చేస్తున్నదేమిటి?’ అని ఎవరు ఆయనను అడగగలరు?

[13] దేవుని కోపం ఒక పట్టాన ఉపశమించదు. రాహాబుకు సహాయం చేసినవాళ్ళు ఆయనకు లొంగిపోయారు.

[14] ఇలాంటి దేవునితో వాదించడానికి నేను ఎంతటివాణ్ణి? ఆయనతో మాట్లాడడానికి సరైన మాటలు ఎన్నుకోగలిగినంత వాణ్ణా నేను?

[15] నేను న్యాయవంతుణ్ణి అనుకోండి, అయినా ఆయనకు జవాబు చెప్పలేను. తీర్పులో కరుణ చూపమని ఆయనను వేడుకోవలసివస్తుంది.

[16] నేను ఆయనను పిలిస్తే, ఒకవేళ ఆయన జవాబిచ్చినా ఆయన నా మాటలు వింటాడని నాకు నమ్మకం లేదు.

[17] ఆయన నన్ను తుఫాను చేత నలగ్గొట్టేవాడు. నిష్కారణంగా నా గాయాలను ఎక్కువ చేసేవాడు.

[18] ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదైన పదార్థాలు నాకు బాగా తినిపిస్తాడు.

[19] బలవంతుల శక్తిని గురించి ప్రశ్న ఉత్పన్నమైతే ‘నేనే ఉన్నాను’ అంటాడాయన. న్యాయాన్ని గురించి ప్రశ్నిస్తే ‘న్యాయ స్థానానికి నన్ను ఎవరు పిలుస్తారు?’ అంటాడు.

[20] నేను నేరస్తుణ్ణి కాకపోయినా నా మాటలే నా మీద నేరారోపణ చేయవచ్చు. నేను నిర్దోషినైనా వక్రబుద్ధిగలవాణ్ణి అని నా గురించి నా నోరు ప్రకటిస్తుంది.

[21] నేను నిర్దోషినే, అయినా నా మీద నాకే లక్ష్యం లేదు. నా బ్రతుకంటే నాకు లెక్కేలేదు.

[22] అంతా ఒక్కటే. అందుకే ‘నిర్దోషులను గానీ దుర్మార్గులను గానీ దేవుడు నాశనం చేస్తాడ’ని నేనంటున్నాను.

[23] అకస్మాత్తుగా నాశనం సంభవిస్తే దేవుడు నిరపరాధుల దురవస్థను చూచి నవ్వుతాడు.

[24] భూలోకం దుర్మార్గుల వశంలో ఉంది. న్యాయాధిపతుల కండ్లకు గంతకట్టాడాయన. ఆయన కాకపోతే, ఇంకెవరు చేశారు?

[25] పరుగెత్తేవాడికంటే వేగంగా నా రోజులు గతిస్తున్నాయి, మంచి అంటూ ఏమీ లేకుండా అవి త్వరగా దొర్లిపోతున్నాయి.

[26] రెల్లుతో నిర్మించబడ్డ పడవలాగా, గరుడ పక్షి ఎరను చూచి, గభాలున దానిపై వాలినట్లు నా రోజులు దాటిపోతున్నాయి.

[27] నా మూలుగును మరచిపోతాననీ, ముఖం తీరును మార్చుకొని సంతోషంగా ఉంటాననీ నేనసలు అనుకొంటే గదా!

[28] నా బాధలన్నిటికీ నేను భయపడుతున్నాను. నేను నిరపరాధినని నీవు చెప్పబోవడం లేదని నాకు తెలుసు.

[29] నేనే దుర్మార్గుణ్ణి అని నిర్ణయం అయింది గదా! అయితే ఎందుకు నాకీ వృథా ప్రయాస?

[30] నేను మంచునీళ్ళతో కడుగుకొన్నా గానీ, సబ్బుతో చేతులు తోముకొన్నా గానీ

[31] నీవు నన్ను గుంటలో ముంచుతావు. అప్పుడు నా సొంత బట్టలే నన్ను చూచి అసహ్యించుకుంటాయి!

[32] ఆయనకు జవాబివ్వడానికి దేవుడు నాలాగా మనిషి కాడు. మేమిద్దరం కలిసి, న్యాయస్థానానికి వెళ్ళలేము.

[33] మా ఇద్దరి మీద చెయ్యి ఉంచగలిగిన మధ్యవర్తి మాకు లేడు.

[34] ఆయన తన శిక్షాదండం నా మీదనుంచి తొలగించాలి. ఆయన భయంకరమైన చర్యలు నన్ను భయకంపితుణ్ణి చేయకుండా చూడాలి.

[35] అప్పుడు నేను నిర్భయంగా ఆయనతో మాట్లాడుతాను. కాని ఇప్పుడు నేనలా మాట్లాడలేను.

యోబు — Chapters