[1] ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు, దేవుడంటే భయభక్తులు గల మనిషి. అతడు చెడుగునుంచి వైదొలగేవాడు.
[2] అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.
[3] ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, అయిదు వందల జతల ఎద్దులు, అయిదు వందల గాడిదలు అతనికి ఉన్నాయి. ఎందరో అతని క్రింద పనిచేసేవాళ్ళున్నారు. తూర్పు వారందరిలో అతడే గొప్పవాడు.
[4] అతని కొడుకులంతా వంతుల ప్రకారం విందులు చేసేవాళ్ళు. ఎవడి వంతురోజున అతని ఇంట్లో సమకూడే వాళ్ళు. అన్నపానాలు పుచ్చుకోవడానికి వాళ్ళ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా పిలిచేవాళ్ళు.
[5] ఈ విధంగా విందులు అయిపొయ్యాక యోబు ప్రొద్దున్నే లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరికోసమూ హోమబలి చేసేవాడు. వారు అపరాధం చేసి, హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అనే సందేహంతో వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచేవాడు. యోబు ఎల్లప్పుడూ ఇలా చేసేవాడు.
[6] దేవుని కుమారులు యెహోవా సమక్షంలో నిలబడడానికి వచ్చిన రోజు అది. ఆనాడు సైతాను వారితో కలిసి వచ్చాడు.
[7] “నీవు ఎక్కడ నుంచి వస్తున్నావు?” అని యెహోవా సైతానును అడిగాడు. అందుకు సైతాను “భూమిమీద సంచారం చేసి వస్తున్నాను. అక్కడ అటూ ఇటూ తిరుగులాడాను” అని జవాబిచ్చాడు.
[8] యెహోవా సైతానుతో “నీవు నా సేవకుడు యోబు ను చూచి ఆలోచించావా? అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు, దేవుడంటే భయభక్తులు గల మనిషి, చెడుగునుంచి వైదొలగేవాడు. భూలోకమంతట్లో అతనికి సాటి ఎవరూ లేరు” అన్నాడు.
[9] అందుకు సైతాను “దేవుడంటే భయభక్తులు ప్రదర్శిస్తున్నాడంటే, యోబు ఇదంతా ఊరకనే చేస్తున్నాడా?
[10] నీవు అతడికీ, అతడి ఇంటిల్లిపాదికీ, అతడి సర్వస్వానికీ చుట్టూరా కంచె వేశావు గదా! నీవు అతడి చేతి కష్టాన్ని దీవించావు. అందుచేత అతడి ఆస్తి దేశంలో వృద్ధి అయింది.
[11] కానీ, నీవిప్పుడు చెయ్యి చాపి అతడి సర్వస్వాన్ని మొత్తితే అతడు నీ ఎదుటే నిన్ను తిట్టిపోస్తాడు” అన్నాడు.
[12] యెహోవా సైతానుతో అన్నాడు, “యోబు సర్వస్వం నీ వశం. నీవు అతనికి మాత్రం ఏ హానీ చేయకూడదు.” అప్పుడు సైతాను యెహోవా ఎదుట నుంచి వెళ్ళిపోయాడు.
[13] ఒక రోజు యోబు కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నారు.
[14] అప్పుడొక మనిషి యోబు దగ్గరికి వచ్చి ఈ వార్త చెప్పాడు: “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు అక్కడే మేస్తూవున్నాయి. ఇంతలో షెబావాళ్ళు వచ్చి పడి, వాటిని తోలుకుపొయ్యారు.
[15] సేవకులను కత్తివాతకు గురిచేశారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను.”
[16] అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరొకడు వచ్చి, “దేవుని అగ్ని ఆకాశంనుంచి పడింది. గొర్రెలూ, సేవకులూ అంతా కాలిపోయారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను” అన్నాడు.
[17] అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో మరొకడు వచ్చి ఇలా అన్నాడు: “కల్దీయవాళ్ళు మూడు గుంపులుగా వచ్చి పడ్డారు. ఒంటెలను దోచుకుపొయ్యారు. సేవకులను కత్తివాతకు గురి చేశారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను.”
[18] అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంతలో మరొకడు వచ్చి “మీ కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకొంటూవుంటే,
[19] పెద్ద సుడిగాలి ఎడారి వైపు నుంచి వచ్చింది, ఇల్లు నలుమూలలా దెబ్బతీసింది. ఇల్లు యువకుల మీద పడింది. అంచేత వాళ్ళంతా చనిపోయారు. నేనొక్కణ్ణే తప్పించుకుని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను” అన్నాడు.
[20] అప్పుడు యోబు లేచి నిలిచాడు. పైబట్ట చింపుకొన్నాడు. తల వెండ్రుకలు పూర్తిగా క్షౌరం చేయించుకొన్నాడు. అప్పుడు నేలమీద సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు.
[21] “నేను నా తల్లి గర్భంలోనుంచి వచ్చినప్పుడు దిగంబరిని. దిగంబరి గానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసివేశాడు. యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక!” అన్నాడు.
[22] ఈ సంగతులన్నిట్లో దేనిలోనూ యోబు ఎలాంటి తప్పిదమూ చేసినవాడు కాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడని అతడు చెప్పలేదు.