Skip to content
Opens in a new window

[1] తేమానువాడు ఎలీఫజు దానికి ఇలా బదులు చెప్పాడు:

[2] “ఎవడైనా నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నీకేమైనా అభ్యంతరమా? ఎవడైతేమట్టుకు ఏమీ మాట్లాడకుండా ఎలా ఊరుకుంటాడు?

[3] నీవు చాలామందికి బుద్ధి చెప్పినవాడివి. దుర్బలమైన చేతులెన్నో నీ మూలంగా బలపడ్డాయి.

[4] ఎవడైనా కాలు జారితే నీ మాటలతో అలాంటి వ్యక్తిని ఆదుకున్నావు. మోకాళ్ళు సడలినవాళ్ళను బలపరచావు.

[5] అలాంటి నీకు ఇప్పుడు కష్టం వచ్చింది. నీవు కుంచించుకుపొయ్యావు. అది నిన్ను ముట్టడించినప్పుడు నీవు హడలిపోతున్నావు.

[6] నీకు ఉన్న భయభక్తులవల్ల నీకు ధైర్యం కలగదా? నీ నిర్దోష ప్రవర్తనవల్ల ఆశాభావం కలగదా?

[7] తలంచుకో! నిరపరాధి ఎవడైనా ఎప్పుడైనా నాశనమయ్యాడా? నిజాయితీపరులు ఎక్కడైనా తుడిచిపెట్టుకు పోయారా?

[8] నాకు తెలిసినంతవరకు చెడుగును దున్ని, కీడును నాటేవాళ్ళు ఆ పంటనే కోస్తారు!

[9] దేవుని శ్వాసవల్ల వాళ్ళు నాశనం అవుతారు. ఆయన ముక్కుపుటాలలో నుంచి వెలువడే ఊపిరిచేత వాళ్ళు అంతరించిపోతారు.

[10] సింహ గర్జన, క్రూర సింహం చేసే ధ్వని ఆగిపోతుంది. సింహాల కోరలు విరిగిపోతాయి.

[11] సింహం తిండి లేక చచ్చిపోతుంది. సింహం పిల్లలు అటూ ఇటూ చెదరిపోతాయి.

[12] నాకో విషయం రహస్యంగా తెలిసింది. ఎవరో నా చెవిలో గుసగుసలు చెప్పినట్టు అది నాకు వినిపించింది.

[13] గాఢ నిద్ర పట్టే రాత్రివేళ కలవరపెట్టే కలలలో అది వచ్చింది.

[14] నేను భయంతో గజగజలాడిపొయ్యాను. అంచేత నా ఎముకలన్నీ కదలిపోయినట్లయింది.

[15] ఏదో ఊపిరి నా ముఖాన్ని సోకింది. నా ఒంటిమీది వెండ్రుకలు గగురు పొడుచుకున్నాయి.

[16] ఏదో నా దగ్గర నిలబడింది గాని అది ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఏదో స్వరూపం నా కండ్ల ఎదుటే ఉంది. ఏదో స్వరం మెల్లగా నాకు వినిపించింది.

[17] అదేమిటంటే, దేవుని దృష్టిలో ఒక వ్యక్తి శుద్ధుడు కాగలడా? తమ సృష్టికర్త ఎదుట మనిషి పవిత్రుడు కాగలడా?

[18] ఇదిగో విను, ఆయన తన సొంత సేవకులనే నమ్మడం లేదు. తన దూతల్లోనే తప్పులు పట్టుకుంటాడు ఆయన!

[19] అలాంటప్పుడు బంకమట్టి ఇంటిలో ఉన్న వాళ్ళను మట్టిలో పుట్టిన వాళ్ళను నమ్ముతాడా? వాళ్ళు చిమ్మెటకంటే సులభంగా చితికిపొయ్యేవాళ్ళు. వీళ్ళలో మరింకెన్ని తప్పులు ఆయన పట్టుకుంటాడో!

[20] ఉదయానికి సాయంకాలానికి మధ్యవాళ్ళు ముక్కలు చెక్కలైపోతారు. ఎవరూ గమనించకుండా వాళ్ళు శాశ్వతంగా నాశనం అవుతారు.

[21] వాళ్ళ డేరా తాడు తెగిపోతుంది. బుద్ధి రాకముందే చచ్చి ఊరుకుంటారు.

యోబు — Chapters