[1] యోబు తన దృష్టికి తాను నిర్దోషి గనుక ఆ ముగ్గురూ అతనికి జవాబు చెప్పడం మానివేశారు.
[2] అయితే బరకేల్ కొడుకు ఎలీహు అక్కడ ఉన్నాడు. ఇతడు రమా వంశీయుడు, బూజ్ గోత్రంవాడు. అతడు యోబు మీద కోపంతో మండిపడ్డాడు. ఎందుకంటే, యోబు దేవుని కంటే తానే న్యాయవంతుడైనట్టు చెప్పుకొన్నాడు.
[3] అంతేకాదు. యోబు ముగ్గురు స్నేహితులమీద కూడా ఎలీహు మండిపడ్డాడు. యోబు వివాదాలకు జవాబు చెప్పకుండానే వారు అతని మీద నేరారోపణ చేశారు.
[4] వారు ఎలీహుకంటే వయస్సులో పెద్దవారు. అందుచేత యోబుతో మాట్లాడడానికి ఇంతవరకు అతడు కనిపెట్టి ఉన్నాడు.
[5] ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం చెప్పక పోవడంచేత ఎలీహుకు కోపం రగులుకొంది.
[6] కాబట్టి బూజ్ గోత్రంవాడు, బరకేల్ కొడుకైన ఎలీహు ఈ విధంగా మాట్లాడాడు: “నేను వయసులో చిన్నవాణ్ణి. మీరు పెద్దవారు. గనుక నాకు తెలిసినది మీకంటే ముందే చెప్పడానికి భయపడి తటపటాయించాను.
[7] వృద్ధులు మాట్లాడడానికి తగినవారు. ఎక్కువ వయసు జ్ఞానం బోధించడానికి తగినది అని నేను అనుకొన్నాను.
[8] అయినా, మనుషులకు ఆత్మ ఉంది. అమిత శక్తిమంతుని ఆత్మ మూలంగా మనిషికి గ్రహింపు కలుగుతుంది.
[9] వృద్ధులు మాత్రమే జ్ఞానులు కారు. ఎక్కువ వయసు ఉన్నవారికి కూడా ఒక్కొక్కప్పుడు న్యాయం తెలియదు.
[10] అందుచేత నేను చెప్పేదేమిటంటే, నేను కూడా నాకు తెలిసినది తెలియజేస్తాను, వినండి.
[11] నేను మీ మాటలకోసం ఎదురు చూశాను. మీ వాదోపవాదాలు విన్నాను. మీరు మాటలకోసం వెదుకుతూ ఉంటే,
[12] నేను శ్రద్ధగా విన్నాను. అయితే మీలో ఎవరూ యోబు చెప్పినదాన్ని కాదనలేదు. మీలో ఎవరూ ఆయన వాదాలకు జవాబు చెప్పలేదు.
[13] జ్ఞానం మాకు లభించినదనీ, మనుషులకు అతడు అసాధ్యుడు, దేవుడే అతణ్ణి జయించాలనీ అనుకోకండి.
[14] యోబు తన మాటలతో నాతో వాదం పెట్టుకోలేదు. మీ వాదాలు ఆధారంగా నేనాయనకు జవాబు చెప్పను.
[15] వారు తల్లడిల్లిపోయారు. వారు జవాబు చెప్పడం మానివేశారు. చెప్పడానికి మాటలే వారికి దొరకవు.
[16] వారు ఊరుకున్నారు. జవాబు చెప్పడం లేదు. వారు మాట్లాడరని నేనూ ఊరుకోవాలా?
[17] నా వంతుకు నేనూ జవాబు చెప్తాను. నాకు తెలిసిన దానిని నేనూ తెలియజేస్తాను.
[18] నాకు నిలువెల్లా మాటలు నిండి ఉన్నాయి. నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తూవుంది.
[19] నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలాగా ఉంది. అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న కొత్త తిత్తిలాగా ఉంది.
[20] నేను మాట్లాడితేనే గాని, నా బాధ ఉపశమించదు. నా పెదవులు తెరచి జవాబు చెప్పాలి.
[21] వినండి, నేను ఎవరిపట్లా పక్షపాతిని కాను. నేను ఎవరినీ ముఖస్తుతి చేయను.
[22] పొగడ్తలు నాకు చేతకాదు. అలా చేస్తే నా సృష్టికర్త నన్ను త్వరలోనే తొలగించివేస్తాడు.