Skip to content
Opens in a new window

[1] “కన్యను తదేకంగా చూడకూడదని నేను నా కండ్లతో ఒప్పదం చేసుకొన్నాను.

[2] ఎందుకని? దేవుడిచ్చే ప్రతిఫలమేది? పరమ ప్రదేశాలలో ఉన్న అమిత శక్తిమంతుడు నియమించే వారసత్వం మాటేమిటి?

[3] దుర్మార్గులకు విపత్తు రావడమే గదా! చెడుగు చేసేవాళ్ళు ఆపదకు గురి కావడమే గదా!

[4] దేవుడు నా తీరుతెన్నులు చూస్తూనే ఉన్నాడు గదా? నేను ఎన్ని అడుగులు వేసినదీ ఆయన లెక్కిస్తాడు గదా?

[5] దేవుడు నన్ను సరైన త్రాసులో పెట్టి తూస్తాడు గాక! అప్పుడు నా నిజాయితీని తెలుసుకొంటాడు.

[6] ఒకవేళ నా నడతకు అబద్ధాలతో సంబంధం ఉంటే, నా పాదాలు మోసంచేసేందుకు వేగిరపడివుంటే,

[7] నా పాదాలు త్రోవ తప్పి తప్పటడుగు వేసి ఉంటే, నా మనసు నా కండ్లను అనుసరించి ఉంటే, నా చేతులకు అపవిత్రత ఏదైనా అంటుకొనివుంటే,

[8] నేను నాటిన విత్తనం పంట మరొకడు భుజిస్తాడు గాక! నేను నాటిన మొక్కలను పీకివేయడం జరుగుతుంది గాక!

[9] పరస్త్రీ నా హృదయాన్ని మరులుకొలిపివుంటే, నా పొరుగువాడి తలుపు దగ్గర నేను పొంచివుంటే,

[10] నా భార్య వేరొకడి తిరగలి విసురుతుంది గాక! ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక!

[11] ఎందుకంటే, అది దుర్మార్గం. అది న్యాయమూర్తుల దండనకు తగిన నేరం!

[12] అది నాశనకరమైన అగాధంవరకు దహించివేసే అగ్నిలాంటిది. అది నా ఫలసాయాన్ని సమూల ధ్వంసం చేసి విడుస్తుంది.

[13] నా నౌకరు గానీ, నా పనికత్తె గానీ నా మీద ఫిర్యాదు చేసే పక్షంలో వారి ఫిర్యాదు నేను నిరాకరించి ఉంటే,

[14] దేవుడే లేచేటప్పుడు నేనేమి చెయ్యగలను? లెక్క అప్పగించమని ఆయన చెప్పేటప్పుడు, ఆయనకు నేనేమి జవాబు చెప్పను?

[15] తల్లి గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించాడు గదా? మాతృగర్భంలో మనలనందరినీ రూపొందించేవాడు ఆయన ఒక్కడే గదా?

[16] బీదలకు కావలసినది నేను బిగబట్టివుంటే, వితంతువుల దృష్టి మందగిలేలా నేను చేసివుంటే,

[17] తల్లి దండ్రులు లేనివారికి నా ఆహారం ఏమీ ఇవ్వకుండా నేనొక్కణ్ణే తిని వుంటే,

[18] ఎవడైనా బట్టలు లేక చస్తూవుండడం నేను చూస్తే, అక్కరలో ఉన్న వ్యక్తికి కప్పుకోవడానికి ఏమీ లేకపోవడం నా కంటబడితే,

[19] అతడి అంతరంగం నన్ను దీవించకపోతే, నా గొర్రెల ఉన్ని వస్త్రాలు వారు వెచ్చగా కప్పుకొని ఉండకపోతే,

[20] న్యాయసభలో నాకు పలుకుబడి ఉందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు లేనివారి మీద నేను చెయ్యి చేసుకొని వుంటే,

[21] నా భుజం కీలు తప్పి, జారి పడుతుంది గాక! నా మోచేతికి ఎముక విరిగిపోతుంది గాక!

[22] కానీ, నా చిన్నప్పటినుంచీ అనాథలు నా దగ్గర పెరిగారు. నన్ను తండ్రిగా భావించారు. నా తల్లి గర్భాన పుట్టినప్పటినుంచీ అలాంటివారికి త్రోవ చూపేవాణ్ణి.

[23] దేవుని వైభవం ఎదుట నేను నిలవలేనని ఆయన నా మీదికి నాశనాన్ని పంపుతాడేమో అని భయపడేవాణ్ణి.

[24] ఒకవేళ బంగారాన్ని నేను నమ్ముకొని వుంటే, మేలిమి బంగారాన్ని ఉద్దేశించి ‘నువ్వే నాకు సంరక్షణ’ అని ఉంటే,

[25] గొప్ప ఆస్తి ఉందనీ, నేను సంపాదించుకొన్న సమృద్ధి అయిన ధనం ఉందనీ అతిశయించివుంటే,

[26] సూర్యమండల ప్రకాశాన్ని నేను చూచి, శోభతో చంద్రగోళం సాగిపోతూవుండగా చూచి,

[27] నా హృదయంలో రహస్యంగా మరులుకొని వాటిని భక్తిపూర్వకంగా నా చేసంజ్ఞ చేసివుంటే,

[28] ఇదంతా కూడా న్యాయమూర్తి శిక్షించవలసిన నేరమే అవుతుంది, పైన ఉన్న దేవుని పట్ల నేను ద్రోహిని అవుతాను.

[29] నన్ను ద్వేషించినవాడికి నాశనం కలిగితే నేను సంతోషించే పక్షంలో, అతడికి కీడు వాటిల్లితే చూచి నేను ఆనందిస్తే –

[30] నేను అలా చేయలేదు. అతణ్ణి శపించడానికి నా నోటికి సెలవియ్యలేదు. అతడి ప్రాణం మీదికి శాపం రప్పించలేదు.

[31] నా నివాసంలో ఉండేవారు ‘యోబు పెట్టినది తిని తృప్తి పొందనివారెవరు?’ అని పలకకపోతే ఏం?

[32] నేను విదేశీయుణ్ణి బయట ఉండనియ్యలేదు. బాటసారులకు బార్లాగా నా తలుపులు తెరచి ఉంచాను.

[33] ఒకవేళ నేను ఆదాములాగా నా అతిక్రమాలు దాచి పెట్టుకొని, నా అపరాధాన్ని నా హృదయంలోనే అట్టే పెట్టుకొన్నానా?

[34] ఆ కారణంగా పెద్ద గుంపుకు భయపడి, కుటుంబాల తిరస్కారానికి బెదిరి, తలుపు దాటి బయటికి వెళ్ళకుండా ఉండేవాణ్ణా? అలా చేసివుంటే, పైన ఉన్న దేవునిపట్ల నేను ద్రోహం చేసినవాడినవుతాను.

[35] నా మొర వినడానికి ఎవడైనా నాకు ఉంటే ఎంత బావుండేది! ఇదిగో నా సంతకం! అమిత శక్తిమంతుడు నాకు జవాబు చెపుతాడు గాక! ఇదిగో నా ఫిర్యాదీ నా మీద మోపిన ఫిర్యాదు రాస్తాడు గాక!

[36] నేను దాన్ని నా భుజం మీద తప్పక మోస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకొంటాను.

[37] నా అడుగుల లెక్క ఆయనకు నివేదిస్తాను. రాజులాగా నేనాయనను సమీపిస్తాను.

[38] నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేస్తే, భూమి చాళ్ళు అన్నీ ఏడుస్తూవుంటే,

[39] దాని వెల చెల్లించకుండా దాని ఫలసాయం నేనే మింగివేసి వుంటే దాని రైతులకు ప్రాణాపాయం కలిగించి ఉంటే,

[40] గోధుమలకు బదులుగా ముళ్లు, యవలకు బదులుగా కలుపుమొక్కలు మొలుస్తాయి గాక! యోబు మాటలు సమాప్తం.

యోబు — Chapters