Skip to content
Opens in a new window

[1] ఎలీహు ఇంకా అన్నాడు,

[2] “కొంచెం ఉండండి – దేవుని పక్షాన నేనింకా మాట్లాడాలి. ఈ విషయాన్ని మీకు విశదం చేస్తాను.

[3] నా జ్ఞానం దూరం నుంచి తెచ్చుకుంటాను. నా సృష్టికర్తకు న్యాయాన్ని ఆరోపిస్తాను.

[4] నా మాటలు అబద్ధాలు కానే కావు. మీతో ఉన్నవాడి జ్ఞానం పరిపూర్ణమైనది.

[5] ఇదిగో వినండి. దేవుడు మహా బలాఢ్యుడు అయినా ఆయన ఎవరినీ త్రోసివేయడు. ఆయన మహాబలాఢ్యుడు, గొప్ప వివేకం గలవాడు.

[6] దుర్మార్గుల ప్రాణం ఆయన కాపాడడు. బీదలకు న్యాయం చేకూరుస్తాడు.

[7] న్యాయవంతుల మీది నుంచి ఆయన దృష్టి తొలగదు. రాజులతో పాటు వారిని సింహాసనం మీద కూర్చోబెడతాడు. వారిని శాశ్వతంగా హెచ్చిస్తాడు.

[8] మనుషుల సంకెళ్ళతో బంధించబడి ఉంటే, బాధలలో వాళ్ళు చిక్కుబడి వుంటే,

[9] వాళ్ళు చేసినదేమిటో ఆయన వాళ్ళకు తెలియజేస్తాడు. వాళ్ళు విర్రవీగి చేసిన తిరుగుబాట్లను వాళ్ళకు చూపుతాడు.

[10] హెచ్చరిక వినేందుకు వాళ్ళ చెవులు తెరుస్తాడు. చెడుగును మాని రండని ఆజ్ఞాపిస్తాడు.

[11] వారు ఆయన మాట విని ఆయనను సేవిస్తే బ్రతికినన్నాళ్ళూ క్షేమంగా, వారి సంవత్సరాలన్నీ సుఖంగా గడుపుతారు.

[12] వారు వినకపోతే కత్తివాతకు గతించిపోతారు. గ్రహింపు లేకుండానే చనిపోతారు.

[13] హృదయంలో భక్తిలేనివాళ్ళు కోపం కూడబెట్టు కుంటారు. దేవుడు వాళ్ళను బంధించినా, వాళ్ళు సహాయంకోసం మొరపెట్టరు.

[14] వాళ్ళు యువదశలోనే చస్తారు. గుళ్ళలో ఉన్న పురుష సంపర్కుల గుంపుల మధ్య అంతరించిపోతారు.

[15] బాధ అనుభవించేవారిని ఆయన వారి బాధవల్లే విడిపిస్తాడు, కడగండ్ల ద్వారా వారి చెవులను తెరుస్తాడు.

[16] మిమ్మల్ని దుర్దశలో నుంచి ఏమీ ఇరుకు లేని విశాల స్థలానికి రావాలని పురికొలుపుతూ ఉన్నాడు. మీ ముందు ఆహారం సమృద్ధిగా ఉంటుంది.

[17] కాని, దుర్మార్గులలాగా మీరు విమర్శిస్తే, న్యాయం, తీర్పు ఈ రెండూ కలిసి మీ మీదికి వస్తాయి.

[18] మీరు కోపంతో మండిపడుతున్నారు. ఒకవేళ మీరు తిరస్కారం చేయడానికి మీ కోపం కారణం అవుతుందేమో జాగ్రత్త! అప్పుడు గొప్ప విడుదల వెల మిమ్మల్ని తప్పించడం అసాధ్యం.

[19] మీ మొర, లేదా, మీ బల ప్రభావాలంతా మిమ్మల్ని బాధలనుంచి తప్పిస్తాయా?

[20] ప్రజలు తమ స్థలాలలో అతరించిపోయే రాత్రి రావాలని ఆశించకండి.

[21] జాగ్రత్తగా ఉండండి. అక్రమం జోలికి పోవద్దు. బాధకంటే ఇది మంచిదని కోరుకున్నారు గదూ!

[22] ఇదిగో వినండి. దేవుడు బల ప్రభావాలతో పై స్థానం వహించినవాడు. ఆయనలాగా ఉపదేశించగలవాడెవడు?

[23] ఆయనకు ఇలా చెయ్యాలని చెప్పగలిగిన వాడెవడు? అక్రమం చేశావు అని ఎవడు ఆయనతో అనగలిగాడు?

[24] మనుషులు సంకీర్తనం చేసి ఆయన చర్యలను ఘనపరచాలని మీరు జ్ఞాపకముంచుకోండి!

[25] ప్రతి మనిషీ వాటిని చూచి ఉన్నాడు. మనుషులు వాటిని దూరంనుంచీ చూస్తారు.

[26] ఇదిగో వినండి. దేవుడు గొప్పవాడు. మనం ఆయనను ఎరగము! ఆయన సంవత్సరాల మొత్తం ఎంతో ఎవరూ విచారించి తెలుసుకోలేరు.

[27] వాన చినుకులను ఆయన పై నుంచి కురిపిస్తాడు. మంచు పరిమాణాన్ని బట్టి వర్షం కురుస్తుంది.

[28] మేఘాలు వర్షిస్తాయి. మనుషుల మీదికి వానలు సమృద్ధిగా దిగజారుతాయి.

[29] మేఘాలు ఎలా వ్యాపిస్తాయో, ఆయన పొదరింట్లోనుంచి ఎలా ఉరుములు వస్తాయో ఎవరికి తెలుసు?

[30] చూడండి! ఆయన తన చుట్టు మెరుపులు ప్రసరించేలా చేస్తాడు. సముద్రం అడుగున ఉన్న నీళ్ళతో తను కప్పుకుంటాడు.

[31] వీటితో ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ప్రజలకు ఆయన సమృద్ధిగా ఆహారమిస్తాడు.

[32] రెండు చేతులతో మెరుపులు పట్టుకొని విసిరివేస్తాడు. పిడుగు గురికి తగిలేట్టు ఆయన ఆజ్ఞాపిస్తాడు.

[33] ఈ మెరుపు గాలివానలో ఆయన రాకడను ప్రకటిస్తుంది. అది పశువులకు కూడా చాటిస్తుంది.

యోబు — Chapters