Skip to content
Opens in a new window

[1] అప్పుడు యెహోవా గాలివాన నుంచి యోబుకు ఈ విధంగా జవాబిచ్చాడు:

[2] “ఇక్కడ తెలివితక్కువ మాటలు పలికి ఆలోచనను చీకటి చేస్తున్నది ఎవరు?

[3] ధైర్యం తెచ్చుకొని, లేచి, నడుము కట్టుకో! నేను నిన్ను అడుగుతాను. నీవు జవాబు చెప్పు.

[4] నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకే గనుక వివేకం ఉంటే చెప్పు!

[5] దాని కొలతలు నిర్ణయించినదెవరు? – నీకు తెలుసు గదా! దాని మీద కొలనూలు వేసినదెవరు?

[6] దాని స్తంభాలకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? దానికి మూలరాయి వేసినదెవరు?

[7] అప్పుడు వేకువ చుక్కలు కలిసి గానం చేశాయి. దేవ కుమారులంతా ఆనంద ధ్వనులు చేశారు.

[8] సముద్రం భూగర్భంలో నుంచి ఒక పెట్టున పొంగిపొర్లి వచ్చినప్పుడు దానికి తలుపులు మూసివేసినదెవరు?

[9] మేఘాన్ని దానికి వస్త్రంగా, కటిక చీకటి దానికి పొత్తి గుడ్డగా నేను చేసినప్పుడు నీవెక్కడున్నావు?

[10] దానికి సరిహద్దులను ఏర్పరచి, దానికి తలుపులూ, వాటి గడియలూ పెట్టి,

[11] ‘నీవు ఇంతవరకే రావాలి. మరీ, చెలరేగే అలలు ఇక్కడే ఆగిపోవాలి’ అని నేను చెప్పినప్పుడు నీవెక్కడ ఉన్నావు?

[12] నీ రోజుల్లో నీవు వేకువను శాసించావా?

[13] అది భూమి అంచులను పట్టుకొని దుర్మార్గులను దానిలో లేకుండా దులిపివేసేలా నీవు ఎప్పుడైనా ఉదయానికి దాని స్థలాన్ని నిర్ణయించావా?

[14] భూమి ముద్ర వేయబడ్డ బంకమట్టిలాగా మారుతుంది. అది విచిత్రంగా ఉన్న వస్త్రంలాగా కనిపిస్తుంది.

[15] అప్పుడు దుర్మార్గుల దగ్గరనుంచి వారి వెలుగు తొలగించడం జరుగుతుంది. పైకెత్తిన చెయ్యి విరగ్గొట్టడం జరుగుతుంది.

[16] సముద్రంలోని ఊటలలోకి ప్రవేశించావా నీవు? జలాగాధం లోతులో తిరిగావా?

[17] మృత్యు ద్వారాలు నీకు తెరుచుకున్నాయా? చావు నీడల గుమ్మాలను నీవు చూశావా?

[18] భూగోళం ఎంత విశాలమో నీవు చూశావా? ఇదంతా నీకు తెలిస్తే చెప్పుకో!

[19] వెలుగు నివాస స్థలం ఎక్కడ? దానికి మార్గం ఎటు? చీకటి ఉండేదెక్కడ?

[20] వాటి పొలిమేరలకు వాటిని తీసుకువెళ్ళగలవా? వాటి నివాస స్థలానికి త్రోవలు ఏవో నీకు తెలుసా?

[21] ఇదంతా నీకు తెలిసేవుంది గదా! నీవు అప్పటికే పుట్టావు గదా! ఇప్పుడు నీవు చాలా ముసలివాడివి!

[22] నీవు చలిమంచు నిలువ ఉన్న స్థలాలకు వెళ్ళావా? వడగండ్ల ఖజానాలు నీవు చూశావా?

[23] కష్ట కాలానికని వాటిని అట్టే పెట్టి ఉంచాను. రణ రంగానికి, యుద్ధ కాలానికి వీటిని ఉంచాను.

[24] వెలుగును ఏ స్థలంలో వెదజల్లడం జరుగుతుంది? భూమిమీద తూర్పు గాలులు ఎక్కడనుంచి చెల్లా చెదరవుతాయి? ఆ త్రోవలు నీకు తెలుసా?

[25] ప్రచండ వర్షం పొర్లిపారేలా భూమిమీద పాయలుగా చీల్చినదెవరు? ఉరుములో మెరుపుకు మార్గం ఏర్పరచినదెవరు?

[26] నిర్జన ప్రదేశంలో భూమి మీద వర్షం కురిపించేది ఎవరు? మనుషులు లేని ఎడారిలో వాన రప్పించేది ఎవరు?

[27] ఆ విధంగా పాడైపోయిన బీడు భూమిని తృప్తిపరచి, అందులో లేత గడ్డి మొక్కలను మొలిపించేదెవరు?

[28] వర్షానికి తండ్రి ఉంటాడా? మంచు బిందువులను కన్నదెవరు?

[29] మంచు గడ్డ వచ్చేది ఎవరి గర్భంలో నుంచి? పై నుంచి దిగి వచ్చే చల్లని మంచును పుట్టించేదెవరు?

[30] నీళ్ళు రాయిలాగా అయిపోతాయి. లోతైన నీళ్ళ ఉపరితలం గడ్డ కట్టుకుపోతుంది.

[31] కృత్తిక నక్షత్ర సముదాయాన్ని నీవు అరికట్టగలవా? మృగశీర్ష నక్షత్రాల బంధకాలను నీవు విప్పగలవా?

[32] నక్షత్ర రాసులు సకాలంలో ఉదయించేలా చేయగలవా? సప్తర్షి నక్షత్రాలను, వాటికి చెందిన నక్షత్రాలను నీవు నడిపించగలవా?

[33] ఆకాశాల్లో ప్రవర్తిల్లే నియమాలు నీకు తెలుసా? ఆ నియమాలను భూమి మీద స్థాపించగలవా?

[34] మేఘాలకు ఆజ్ఞాపించి, జల ప్రవాహాలు నిన్ను ముంచి ఎత్తేలా చేయగలవా?

[35] పిడుగులను శాసించి, వాటిని బయటికి రప్పించి ‘ఇదిగో, మేమున్నాం’ అని వాటిచేత అనిపించగలవా?

[36] మనసుకు జ్ఞానమిచ్చినదెవరు? హృదయానికి తెలివితేటలు ఇచ్చినది ఎవరు? మేఘాలను లెక్క పెట్టడానికి కావలసిన జ్ఞానం ఎవరికి ఉంది?

[37] దుమ్ము గట్టి పడినప్పుడు, మట్టి పెళ్ళలు ఒకదానికొకటి అంటుకొన్నప్పుడు,

[38] ఆకాశ పాత్రలలో నుంచి వాన కురిసేలా వాటిని వంచగలవాడెవడు?

[39] ఆడ సింహంకోసం ఎరను వేటాడుతావా నీవు?

[40] సింహం పిల్లలు గుహలలో పడుకొంటూ ఉంటే, అవి దాక్కునే చోట పొంచి ఉంటే, నీవు వాటి ఆకలి తీరుస్తావా?

[41] కాకి పిల్లలు ఆహారం లేక తిరుగాడుతూ దేవునికి మొరపెట్టుకొంటూ ఉంటే, కాకికి ఆహారం పెట్టేదెవరు?

యోబు — Chapters