[1] “ఇదిగో వినండి. ఇదంతా నా కంటికి కనబడింది. నా చెవి దాన్ని విన్నది. గుర్తించింది కూడా.
[2] మీకు తెలిసినది నాకూ తెలుసు. నేను మీకేమీ తీసిపోను.
[3] అయినా, నేను అమిత శక్తిగలవానితోనే మాట్లాడాలని ఉన్నాను. దేవునితోనే తర్కించాలని ఉన్నాను.
[4] మీరు అబద్ధాలు కల్పిస్తారు. మీరంతా ఎందుకూ కొరగాని వైద్యులు.
[5] మీరు బొత్తిగా మాట్లాడకుండా ఉంటే మంచిది. అది మీ పట్ల జ్ఞానమనిపించుకుంటుంది.
[6] ఇప్పుడు నా వివాదం వినండి. నా పెదవుల మీదుగా వెలువడే తర్కం ఆలకించండి.
[7] దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడుతారా? ఆయన తరఫున వంచన మాటలు పలకవచ్చా?
[8] ఆయన పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తారా? దేవుని తరఫున వాదిస్తారా మీరు?
[9] ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమమా? మనుషులను మోసగించినట్టు ఆయనను మోసపుచ్చగలరా?
[10] మీరు రహస్యంగా పక్షపాతం వహిస్తే, ఆయన మిమ్మల్ని ఖండించితీరుతాడు.
[11] అలాంటప్పుడు ఆయన ప్రభావం మీకు బీతి పుట్టించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా?
[12] మీరు పలికే లోకోక్తులు బూడిదలాంటి సామెతలు. మీ బలమైన వాదాలు మట్టిగోడల్లాంటివి.
[13] ఇక ఊరుకోండి! నన్ను శాంతంగా ఉండిపోనియ్యండి. నేను మాట్లాడుతాను. నా మీదికి ఏది వస్తే అది వస్తుంది.
[14] నా శరీరంలో నాకే ఎర ఎందుకు కావాలి? నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని మాట్లాడుతాను.
[15] ఇదిగో వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయనవైపు ఆశాభావంతో ఎదురుచూస్తాను. ఆయన ఎదుటే నా మార్గం సరైనదని రుజువు చేసితీరతాను.
[16] దీనివల్ల నాకు విడుదల కలుగుతుంది కూడా. ఎలాగంటే భక్తిలేనివాడు దేవుని ఎదుటికి రావడానికి సాహసించడు.
[17] వినండి, నా మాటలు శ్రద్ధతో ఆలకించండి. నేను చెప్పేది మీ చెవుల్లో మారు మ్రోగాలి.
[18] చూడండి, నా వ్యాజ్యెం సిద్ధం చేసుకొన్నాను. నేను నిర్దోషినని వెల్లడి అవుతుందని నాకు తెలుసు.
[19] నాతో వ్యాజ్యెమాడి గెలవగలవాడెవడు? ఒకవేళ ఎవడైనా ఉంటే నేను మౌనంగా చచ్చి ఊరుకుంటాను.
[20] దేవా, నేను రెండు మనవులు మాత్రమే చేస్తున్నాను. వాటిని తిరస్కరించవద్దు. అప్పుడు నీ ముఖం చూడకుండా నేను దాక్కోను.
[21] నీ బరువైన చెయ్యి నామీదనుంచి తీసివెయ్యి. నీగురించిన బీతి నన్ను భయపెట్టనియ్యకు.
[22] అప్పుడు నన్ను పిలువు. నేను జవాబిస్తాను. పోనీ, నేను పిలుస్తాను, నీవు పలుకు.
[23] నా అపరాధాలెన్ని? నా పాపాలెన్ని? నా అతిక్రమం, నా పాపం ఏమిటో నాకు తెలుపు.
[24] నీ ముఖం ఎందుకు చాటు చేసుకొన్నావు? నన్ను నీ శత్రువుగా ఎంచుతున్నావెందుకు?
[25] అటూ ఇటూ కొట్టుకుపోతున్న ఆకును భయపెట్టేస్తావా? ఎండు చెత్త వెంటబడుతావా?
[26] నీవు నాకు కఠిన శిక్ష విధించావు. బాల్యంలో నేను చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేస్తున్నావు.
[27] నా కాళ్ళకు బొండ వేసి బిగించావు. నా నడత అంతా నీవు బాగా చూస్తున్నావు. నా అడుగులకు నీవు స్వయంగా గిరి గీచావు.
[28] ఇలా మనిషి కుళ్ళిపోతున్నదానిలాగా కృశించిపోతాడు. చిమ్మెటలు కొట్టిన వస్త్రంలాగా ఉంటాడు.