[1] “నా ప్రాణం నీరసించిపోయింది. నా రోజులు అయిపొయ్యాయి. సమాధి నాకోసం నోరు తెరచివుంది.
[2] ఎగతాళి చేసేవాళ్ళు నా చుట్టు చేరారు. విరోధ భావాలు నేను గమనిస్తూనే ఉన్నాను.
[3] దేవా, నాకు నీవే స్వయంగా జామీను ఉంటానని మాట ఇవ్వు. నాకు నీవు గాక మరెవ్వరు జామీను ఉంటారు?
[4] నీవు వీరి హృదయాలను మూసివేసి, జ్ఞానం రాకుండా చేశావు. కాబట్టి నీవు వారిని పైచేయి కానివ్వవు.
[5] దోపిడీ సొమ్ముకోసం స్నేహితులను నిందించేవాడికి తన పిల్లల కండ్లు చీకిపోవడమే జరుగుతుంది.
[6] దేవుడు నన్ను ప్రజల మధ్య సామెతగా చేశాడు. నలుగురు నా ముఖం మీద ఉమ్మివేస్తారు.
[7] శోకంచేత నా కంటిచూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలైపొయ్యాయి.
[8] నిజాయితీపరులకు ఇది ఆశ్చర్యజనకం. అమాయకులు దైవభక్తి లేని వాళ్ళను చూచి ఆందోళన చెందుతారు.
[9] అయినా, న్యాయవంతులు తమ బ్రతుకుతీరును అనుసరిస్తూనే ఉంటారు. శుద్ధ హస్తాలున్నవారి బలం అంతకంతకూ ఎక్కువ అవుతుంది.
[10] ఇప్పుడు మీరంతా మరో సారి నా మీదికి రండి! మీలో జ్ఞాని ఒక్కడూ కూడా నాకు కనబడడు!
[11] నా రోజులు గతించాయి. నా ఆశయాలు అంతరించాయి. నా హృదయాభిలాషలు భంగం అయ్యాయి.
[12] అయితే ఈ మనుషులు రాత్రినేమో పగలంటారు. చీకటి కమ్ముకొంటే, వెలుగు సమీపం అయిందంటారు.
[13] ఒకవేళ మృత్యు లోకమే నా ఇల్లు కావాలని నేను ఆశిస్తాను అనుకోండి. చీకటిలో నా పరుపు పరుచుకొంటాను అనుకోండి.
[14] గోరీని చూచి ‘నీవే నా తండ్రివి’ అనీ, పురుగులతో ‘నీవే నా తల్లివి. నా సోదరివి’ అనీ అంటాననుకోండి.
[15] అలాంటప్పుడు నా ఆశాభావం ఏమైనట్టు? దానిని ఎవరు చూడగలరు?
[16] అది నాతోపాటు మృత్యులోకం కటకటాల దగ్గరికి దిగిపోతుందా? అది నాతో కూడా మట్టిపాలవుతుందా?