Skip to content
Opens in a new window

[1] అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

[2] “ఈ రోజున కూడా నేను దుఃఖంతో ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. నా మూలుగుల మీద బరువైన చెయ్యి పడింది.

[3] ఆయన నాకు ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది! ఆయన నివాస స్థానానికి చేరాలని ఉంది నాకు!

[4] అప్పుడు ఆయన ఎదుటే నా ఫిర్యాదు చెప్పుకొంటాను. వాదోపవాదాలు నా నోటినిండా ఉంటాయి.

[5] నాకు జవాబుగా ఆయన ఏ మాటలు పలుకుతాడో తెలుసుకొంటాను. ఆయన చెప్పబోయేది ఏమిటో నేను చూచుకొంటాను.

[6] ఆయన తన మహా బలసామర్థ్యాలను ప్రయోగించి నాతో వాదిస్తాడంటారా? అలా చెయ్యడాయన. ఆయన నా మాటలు శ్రద్ధతో వింటాడు.

[7] అక్కడ యథార్థపరుడు ఆయన ఎదుట చెప్పుకోగలడు. అప్పుడు నా న్యాయమూర్తి నాకు ఏమీ శిక్ష విధించడు.

[8] కాని, నేను తూర్పుకు వెళ్ళినా ఆయన అక్కడ లేడు. పడమటికి వెళ్ళినా అక్కడా ఆయన దొరకడు.

[9] ఉత్తరాన ఆయన పని చేస్తూవుంటే, అక్కడ కూడా ఆయనను చూడలేకపోతున్నాను. ఆయన దక్షిణం వైపుగా తిరిగితే కూడా ఆయన నాకు కనబడడు.

[10] అయినా, నేను నడిచే త్రోవ ఆయనకు తెలుసు. ఆయన పెట్టిన పరీక్షలో నుంచి నేను బంగారంలాగా బయటికి వస్తాను.

[11] నా పాదాలు ఆయన అడుగుజాడల్లోనే నడిచాయి. ఆయన మార్గాన్నే అనుసరించాను. వైదొలగినవాణ్ణి కాను.

[12] ఆయన పెదవులమీదినుంచి వచ్చిన ఆజ్ఞను నేను విడిచిపెట్టలేదు. ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయాలకంటే విలువైనవని భావించాను.

[13] అయితే ఏం? ఆయన చపలచిత్తుడు కాడు. ఆయన మనసు త్రిప్పగలవాడెవడు? ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తాడు.

[14] ఆయన నా పట్ల ఏది విధించాడో అదే ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇలాంటివెన్నో నిర్వహిస్తాడు.

[15] అందుచేత ఆయన ఎదుట భయాందోళన పడుతున్నాను. నేనిది ఆలోచిస్తే, హడలిపోతున్నాను.

[16] నా హృదయం క్రుంగిపోయింది – దీనికి దేవుడే కారణం! అమిత శక్తిమంతుని మూలంగానే నాకీ భయాందోళన!

[17] అంధకారం నా ముందరే ఉంది. నా ముఖాన్ని కటిక చీకటి కమ్ముకుంది. అయినా, నేను మౌనం వహించలేదు.

యోబు — Chapters