Skip to content
Opens in a new window

[1] “స్త్రీ గర్భవాసాన పుట్టిన మనిషి ఆయుష్షు స్వల్పం. అతడికి ఎప్పుడూ కడగండ్లే.

[2] పువ్వులాగా వికసిస్తాడు, త్వరలో వాడిపోతాడు. పారిపోయే నీడలాగా గతించిపోతాడు.

[3] దేవా, ఇలాంటివాడి మీద చూపు నిలుపుతావా? తీర్పు తీర్చడానికి నన్ను నీ ఎదుటికి రప్పిస్తావా?

[4] అశుద్ధమైన దానిలో నుంచి శుద్ధమైనదానిని పుట్టించ గలవాడెవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు.

[5] మనిషి బ్రతకవలసిన రోజులు ఎన్నో నీవు నియమించావు. అతడు ఎన్ని నెలలు బ్రతుకుతాడో నీకు తెలుసు. అతడి ఆయువుకు సరిహద్దు నిర్ణయించావు. దానిని అతడు దాటలేడు.

[6] గనుక అతడి వైపు నుంచి నీ దృష్టి తిప్పుకో, జీతగాడిలాగా ఆ కాలమంతా అతడు పూర్తి చేసేవరకు వాణ్ణి వదలిపెట్టు.

[7] చెట్టు విషయం ఆశాభావం ఉంది. దాన్ని నరికివేస్తే మళ్ళీ చిగురిస్తుంది. అది తప్పక పిలకలు వేస్తుంది.

[8] దాని వేళ్ళు భూమిలో పాతగిలిపోతే, దాని మ్రాను మట్టిలో కూరుకుపోయి చస్తే,

[9] నీటి వాసన తగిలిందంటే చాలు – అది చిగురిస్తుంది. లేత మొక్కలాగా అది కొమ్మలు తొడుగుతుంది.

[10] అయితే మనిషి చస్తాడు. చాచుకొని అలాగే పడివుంటాడు. మనిషి ప్రాణం విడిచాక, అతడు ఎక్కడున్నట్టు?

[11] సముద్రంనుంచి నీళ్ళు ఆవిరి అయిపోతాయి. వాగుల్లో నీళ్ళు తగ్గిపోయి, ఇంకిపోతాయి.

[12] అలాగే మనుషులు చనిపోయి తిరిగి లేవరు. ఆకాశం లేకుండా పోయేవరకు మేలుకోరు. ఎవరూ వారిని నిద్ర లేపరు.

[13] నీవు నన్ను మృత్యులోకంలో దాచి వేస్తే ఎంత బావుండేది! నీ కోపాగ్ని చల్లారేవరకు నన్ను మరుగు చేస్తే ఎంతో బావుండేది గదా! నీవు నాకు ఓ గడువు పెట్టి, ఆ తరువాతే నన్ను తలచుకొంటే బావుండేది.

[14] మనుషులు చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతుకుతారా? అలాగైతే నా పోరాటం జరిగే రోజులన్నీ ఆ మార్పు నాకు కలిగేవరకు నేను ఆశాభావంతో ఎదురు చూడగలిగి ఉంటాను.

[15] అప్పుడు నీవు పిలుస్తావు. నేను మారు పలుకుతాను. నీవు చేతులతో చేసిన పనిపట్ల నీకు ఆసక్తి ఉంటుంది.

[16] ఇప్పుడు నా అడుగులను నీవు లెక్క వేస్తున్నావు. నీవు నా పాపాలు బాగా గమనించడం లేదా?

[17] నా అతిక్రమాలు సంచిలో పెట్టి మూసివేశావు. నా అపరాధాలు భధ్రంగా ఉంచావు.

[18] పడిపోయిన పర్వతం కూడా అలాగే ముక్క చెక్కలై పోతుంది. కొండ శిల తన చోటునుంచి పడిపోతుంది.

[19] నీళ్ళు రాళ్ళను అరగదీస్తాయి. ప్రవాహాలు పొర్లి పారి, భూమిపై మట్టి కొట్టుకుపోతుంది. ఆవిధంగానే నీవు మనిషి ఆశాభావాన్ని భగ్నం చేస్తావు.

[20] నీవు మనుషులను ఎప్పటికీ అణచివేస్తావు. కనుక వారు అంతరించిపోతారు. నీవు వారికి వికార ముఖం కలిగించి వారిని పారదోలుతావు.

[21] వారి పిల్లలు ఘనత వహించినా ఆ సంగతి వారికి తెలియదు. దీనస్థితి అనుభవించినా వారికది తెలియదు.

[22] తమ సొంత శరీరంలో ఉన్న బాధ మాత్రమే అనుభవిస్తారు. తమ విషయమే శోకిస్తారు.

యోబు — Chapters