Skip to content
Opens in a new window

[1] అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు:

[2] “నన్ను మీరిలా ఎంతకాలం వేధిస్తారు? ఎంత కాలం మాటలచేత చితగ్గొట్టివేస్తారు?

[3] మీరు నన్ను పది సార్లు ఆడిపోసుకొన్నారు. నన్నిలా బాధిస్తూ ఉంటే, మీకు సిగ్గు అనిపించదూ!

[4] నాదే తప్పయితే, నా తప్పు నాకే ఉంటుంది.

[5] నాకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకొని, నామీద మోపిన నింద రుజువు చేయాలని ఉంటే,

[6] ఒక సంగతి తెలుసుకోండి – దేవుడు నన్ను తారుమారు చేశాడు. తన వలలో నన్ను చిక్కించుకొన్నాడు.

[7] నాపట్ల దౌర్జన్యం జరుగుతూ ఉందని నేను మొరపెట్టినా జవాబు రావడం లేదు. సహాయంకోసం ప్రాధేయపడినా నాకు న్యాయం చేకూరడం లేదు.

[8] నా మార్గం చుట్టూ దేవుడు కంచె వేశాడు. దీన్ని నేను దాటలేను. నా దారి అంతా చీకటిమయం చేశాడు.

[9] నా గౌరవమంతా ఆయన హరించివేశాడు. నా తలమీది నుంచి కిరీటం తొలగించాడు.

[10] అన్ని వైపుల నుంచీ ఆయన నన్ను దెబ్బ తీశాడు. నేను నాశనమయ్యాను. నా ఆశాభావాన్ని చెట్టులాగా వేళ్ళతో పెళ్ళగించివేశాడు.

[11] ఆయన కోపాగ్ని నా మీద రగులుకొంది. నన్ను శత్రువుల్లో ఒకడుగా లెక్క కట్టివేశాడు.

[12] ఆయన సైన్యాలు కూడి వచ్చాయి. వాళ్ళు నా చుట్టూరా ముట్టడి దిబ్బలు వేశారు. నా డేరా చుట్టూ దిగారు.

[13] నా తోబుట్టువులనే ఆయన నాకు దూరం చేశాడు. నాకు పరిచయం ఉన్నవాళ్ళు నాకు పూర్తిగా పరాయివారు అయిపొయ్యారు.

[14] నా బంధువులే నాకు ముఖం తప్పించారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపొయ్యారు.

[15] మా ఇంట్లో దాసదాసీ జనం నన్ను పరాయి వాణ్ణిగా భావిస్తారు. వారి దృష్టికి నేను పూర్తిగా విదేశీయుణ్ణి!

[16] నేను నా సేవకుణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను నోరు తెరచి వాణ్ణి ప్రాధేయపడవలసివచ్చింది.

[17] నా ఊపిరి కూడా నా భార్యకు అసహ్యమైపోయింది. నా తోబుట్టువులకే నా వాసన అంటే పడకుండా పోయింది.

[18] చిన్న పిల్లలు కూడా నన్ను తృణీకరిస్తున్నారు. నేను కనబడితే చాలు, వారు నన్ను తిట్టిపోస్తారు.

[19] నా సన్నిహిత స్నేహితులందరూ నన్ను ఏవగించు కొంటున్నారు. నేను ప్రేమించినవారు నాకు ఎదురు తిరిగారు.

[20] నా ఎముకలు చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా పండ్ల చిగుళ్ళ మీది చర్మం మాత్రమే మిగిలివుంది.

[21] నా మీద జాలి చూపండి, నా స్నేహితులారా! జాలి చూపండి. దేవుని చేయి నన్ను దెబ్బ తీసింది.

[22] దేవునిలాగే మీరు నన్నెందుకిలా హింసిస్తారు? నా శరీర మాంసం నాశనమైనదంటే, అది మీకు చాలదా?

[23] నా మాటలు లిఖితమైవుంటే ఎంత బావుండేది! ఇవన్నీ ఓ పుస్తకంలో రాసి పెట్టివుంటే ఎంత మంచిది!

[24] నా మాటలు సదాకాలం నిలిచివుండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించిపోసివుంటే ఎంత బావుండేది!

[25] నాకు తెలుసు. నా విమోచకుడు సజీవుడు. తుదకు ఆయన భూమిమీద నిలబెడతాడు.

[26] ఈ విధంగా నా చర్మం చీకి చివికిపోయాక, నా శరీరంతోనే నేను దేవుణ్ణి చూస్తాను.

[27] నేను స్వయంగా చూస్తాను. మరెవరో కాదు, నేనే నా సొంత కళ్ళతో ఆయనను చూస్తాను. నా హృదయం నాలో సన్నగిల్లుతూ ఉంది.

[28] నాలోనే దీనికంతటికీ మూలకారణం ఉందని ‘ఎలా ఇతణ్ణి హింసిద్దామా?’ అనుకొంటూ ఉంటే

[29] మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుని ఆగ్రహం ఖడ్గాన్ని పంపి దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉందని మీరు తెలుసుకొంటారు.

యోబు — Chapters