[1] “ఇప్పుడు నాకంటే వయసులో చిన్నవాళ్ళు నన్ను వేళాకోళం చేస్తున్నారు. వీరి తండ్రులు నా మందలను కాచే కుక్కలతో ఉండటానికి తగినవాళ్ళు కాదని అప్పుడు అనుకొనేవాణ్ణి.
[2] వాళ్ళు నీరసించిపోయినవాళ్ళు. వాళ్ళ చేతుల బలం నాకేం లాభం?
[3] దరిద్రంచేత ఆకలితో బక్కచిక్కిపొయ్యారు వాళ్ళు. ఎడారిలో, ఎంతో కాలంగా పాడైపోయిన నిర్జన స్థలంలో, తిండికోసం వాళ్ళు తిరుగులాడుతూ ఉండేవాళ్లు.
[4] అడవిలోని తుత్తిచెట్ల ఆకులు మేసేవాళ్ళు. తంగేడి వేళ్ళు తినేవారు.
[5] ప్రజలు తమ మధ్యనుంచి వాళ్ళును తరిమికొట్టారు. దొంగలను తరిమి కేకలు వేసినట్టు వీళ్ళ వెంటబడి కేకలు పెట్టారు.
[6] భయంకరమైన లోయలలో, నేల సందుల్లో, బండల సందుల్లో వాళ్ళు నివసించవలసి వచ్చింది.
[7] పొదలలో గాడిదల్లాగా వాళ్ళు ఓండ్రలు పెట్టారు. ముళ్ళ పొదల క్రింద వాళ్ళు పోగయ్యారు.
[8] వాళ్ళు మూర్ఖులకు, అనామకులకు పుట్టినవారు. వాళ్ళను దేశంలో నుంచి తరిమివేయడం జరిగింది.
[9] అలాంటివాళ్ళ కొడుకులు ఇప్పుడు నా గురించి అవహేళనగా పాటలు పాడుతున్నారు. నేను వాళ్ళ దృష్టిలో ఓ సామెతనైపోయాను.
[10] వాళ్ళు నన్ను అసహ్యించుకొంటున్నారు. నాకు దూరంగా తొలగిపోతున్నారు. నన్ను చూచి ఉమ్మి వేయడానికి వెనకాడరు.
[11] దేవుడు నా వింటినారి విప్పాడు. ఆయన నన్ను బాధకు గురి చేశాడు. గనుక వాళ్ళు నాకు లోబడకుండా కళ్ళెం వదిలించు కొంటున్నారు.
[12] నా కుడిప్రక్కను అల్లరిమూక లేచింది. వాళ్ళు నా కాళ్ళు జారేలా చేస్తున్నారు. పట్టణాన్ని ముట్టడించినట్లు నన్ను నాశనం చేయడానికి నా మీద తమ ప్రయత్నాలన్నీ ప్రయోగిస్తున్నారు.
[13] వాళ్ళు నిస్సహాయులు. అయినా, నా మార్గాన్ని పాడు చేస్తున్నారు. నా మీదికి వచ్చిన విపత్తును అధికతరం చేస్తున్నారు.
[14] పెద్ద గండిపడి, ప్రవాహం పారినట్లు వాళ్ళు వచ్చిపడతారు. నాశనమైపోయిన నా స్థలంలోకి దొమ్మిగా చొరబడతారు.
[15] భయంకరమైనవి నా మీద పడ్డాయి. నా పేరు ప్రతిష్ఠలు గాలికి కొట్టుకుపోయినట్లయింది. మేఘంలాగా నా సంక్షేమం కాస్తా అంతర్ధానమైపోయింది.
[16] నా ప్రాణం నాలో కృశించి పోతూవుంది. బాధకాలం నన్ను చిక్కించుకొంది.
[17] రాత్రిపూట నా ఎముకలు విరిచినట్లనిపిస్తుంది. నన్ను వేధించే నొప్పులకు నిద్ర ఉండదు.
[18] విపరీత రోగంచేత నామీది వస్త్రాలు వికారమై పొయ్యాయి. నా రోగం మెడచుట్టూ చొక్కాలాగా నన్ను బిగించివేస్తూవుంది.
[19] అది నన్ను బురదలోకి పడనెట్టింది. నేను దుమ్ము, బూడిద అయిపొయ్యాను.
[20] దేవా, నీకు ఆక్రందన చేస్తున్నాను గాని, నీవు బదులు చెప్పడం లేదు. నేను నిలుచుంటే నీవు నన్ను ఎగాదిగా చూస్తున్నావు, అంతే.
[21] నీవు నా పట్ల ఎంతో కఠినుడుగా అయిపొయ్యావు. నీ చేతిబలం వినియోగించి, నన్ను హింసిస్తూవున్నావు.
[22] గాలితో నన్ను లేవనెత్తుతున్నావు. గాలిమీద నేను కొట్టుకుపోయేలా చేస్తున్నావు. తుఫాను మూలంగా నేను హరించుకుపోయేలా చేస్తున్నావు.
[23] మరణానికి, జీవులందరికి నిర్ణయించబడ్డ స్థలానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు!
[24] పడిపోయినవాడు చెయ్యి చాపడా? ఆపదలో ఉన్న మనిషి కాపాడమని సహాయంకోసం ఆక్రందన చెయ్యడా?
[25] బాధలో ఉన్నవారి కోసం నేను ఏడ్చాను గదా? దరిద్రంలో ఉన్నవారికోసం నేను శోకించలేదా?
[26] అయినా, నాకు మేలు చేకూరుతుందని నేను ఆశించినప్పుడు కీడే సంభవించింది. వెలుగు కోసం నేను ఎదురు చూశాను. కాని, నాకు వచ్చింది చీకటే.
[27] నేను ఆంతర్యంలో అశాంతితో అలమటించి పోతున్నాను. బాధలు ముంచుకు వచ్చే రోజులు ఎదురయ్యాయి.
[28] సూర్య ప్రకాశం లేకుండా కుమిలిపోతూ తిరుగుతున్నాను. సమాజంలో నిలబడి సహాయంకోసం నేను ఆక్రందన చేస్తున్నాను.
[29] నేను నక్కలకు సోదరుణ్ణి అయ్యాను. నిప్పుకోళ్ళకు చెలికాణ్ణి అయ్యాను.
[30] నా చర్మం నల్లబడి, ఒలుచుకుపోతూవుంది. వేడివల్ల నా ఎముకలు మండిపోతూవున్నాయి.
[31] నా తంతి వాద్యం శోకనాదాన్ని ఒలికిస్తూ ఉంది. నా పిల్లనగ్రోవి దుఃఖధ్వని చేస్తూవుంది.