[1] “ఇదంతా చూస్తూవుంటే నా హృదయం వణికిపోతూ వుంది. నా గుండె తన స్థానం తప్పిందనిపిస్తూ ఉంది.
[2] వినండి! గర్జించే ఆయన కంఠం వినండి! ఆయన నోటినుంచి వెలువడే ధ్వని ఆలకించండి!
[3] ఆకాశం క్రింద సర్వత్రా ఆయన తన స్వరం వినిపిస్తున్నాడు! భూమి కొనలదాకా ఆయన మెరుపులను పంపిస్తున్నాడు!
[4] వాటి తరువాత ఆ స్వరం గర్జనలాగా వినిపిస్తుంది. తన గంబీరమైన కంఠంతో ఉరుములాగా గర్జిస్తాడు. ఆయన కంఠం వినిపిస్తూ ఉంటే మెరుపులను ఆయన ఆపివెయ్యడు.
[5] దేవుడు అద్భుతంగా ఉరుములో గర్జిస్తాడు. ఆయన గొప్ప క్రియలు చేస్తాడు. వాటిని మనం గ్రహించలేము.
[6] ఆయన మంచుకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ‘నీవు భూమిమీద పడాలి’ అంటున్నాడు. అలాగే వానకూ ప్రచండ వర్షానికీ వర్షించవలసిందని ఆజ్ఞాపిస్తున్నాడు.
[7] ప్రతి మనిషి చేతిని మూసి ముద్ర వేస్తాడాయన. ఆ విధంగా వారంతా ఆయన క్రియలను గురించి తెలుసుకొంటారు.
[8] అప్పుడు మృగాలు వాటి గుహలలో చొరబడతాయి. దాక్కునే చోట్లలో ఉండిపోతాయి.
[9] దక్షిణాదినుంచి తుఫాను వస్తుంది. ఉత్తరాదినుంచి చలి వస్తుంది.
[10] చలిమంచు దేవుని ఊపిరిలోనుంచి పుట్టుకు వస్తుంది. నీరు ఉపరిభాగం గడ్డకట్టుకుపోతుంది.
[11] ఆయన నీటితో భారమైన మేఘాలను దట్టంగా ఏర్పరుస్తాడు. మేఘాలలో తన మెరుపులు వ్యాపించేలా చేస్తాడు.
[12] మనుషులు ఉన్న భూతలమంతటా మెరుపులూ మేఘాలూ ఆయన ఆజ్ఞల మేరకు సంచారం చేస్తాయి!
[13] శిక్షించడానికి గానీ, భూలోక క్షేమం కోసం గానీ, ఆయన అనుగ్రహం చూపడానికి గానీ ఇవి ఆయన ఆజ్ఞ ప్రకారం సంచరిస్తాయి.
[14] యోబు, ఈ మాట వినండి! నిదానించి దేవుని అద్భుత క్రియల విషయం ఆలోచించండి.
[15] దేవుడు తన మేఘాలను ఎలా నిర్వహిస్తాడో వాటి మెరుపు ప్రకాశించేందుకు దేవుడెలా చేస్తాడో మీకు తెలుసా?
[16] మేఘాలు ఏ విధంగా తేలిపోతూ వెళ్ళేలా చేస్తాడో తెలుసా? ఇవి సర్వజ్ఞుడైన దేవుని అద్భుత క్రియలు.
[17] దక్షిణం గాలులు వీచినప్పుడు భూమి ప్రశాంతమై, మీ దుస్తులన్నీ ఎలా వెచ్చబడుతాయో తెలిసిన మీకు ఆ సంగతులు తెలుసా?
[18] ఆకాశం పోత పోసిన అద్దంలాగా పరిచినట్టుంది. ఆయనతో కలిసి, ఆకాశం ఆ విధంగా విస్తరించేలా చేయగలరా మీరు?
[19] మేము ఆయనతో ఏమి చెప్పాలో మాకు బోధించండి! అజ్ఞానాంధకారం వల్ల ఏమి చెప్పాలో తోచడం లేదు.
[20] నేను మాట్లాడుతానని ఎవడైనా ఆయనతో చెప్పడం యుక్తమా? ఒక మనిషి తను ఆ విధంగా నిర్మూలమైపోవాలని కోరుతాడా?
[21] ఇప్పుడు మేఘాల చాటున ఉన్న ప్రకాశమానమైన వెలుగు కనిపించడం లేదు. గాలి వీచి మేఘాలను తేటపరుస్తుంది.
[22] ఉత్తర దిక్కునుంచి బంగారు రంగు గల వెలుగు వస్తుంది. దేవుణ్ణి ఆవరించిన ఆ మహా తేజస్సు అత్యద్భుతకరమైనది.
[23] ఆయన అమిత శక్తిమంతుడు. మహత్వపూర్ణుడు, ఆయన మన స్పర్శకు అగోచరుడు. తన మహా నీతిన్యాయాలను ఏ మాత్రమూ తారుమారు చేయడు.
[24] అందుచేత మనుషులకు ఆయన అంటే భయభక్తులు ఉంటాయి. మాలో జ్ఞానం ఉంది అనుకునే వారినేమీ ఆయన లెక్కచెయ్యడు!