Skip to content
Opens in a new window

[1] అప్పుడు తేమానువాడు ఎలీఫజు ఇలా బదులు చెప్పాడు:

[2] “తెలివైనవాడు గాలిమాటలు పలుకుతాడా? తన హృదయంనిండా వడగాడ్పు ఉంచుకొని మాట్లాడతాడా?

[3] వ్యర్థ పదాలు ప్రయోగించి వాదిస్తాడా? ఏమీ ప్రయోజనం లేని ప్రసంగాలు చేస్తాడా?

[4] నీవు అలా చేయడం మాత్రమే గాక, భయభక్తుల భావాన్ని కొట్టివేస్తున్నావు. దైవ ధ్యానాన్ని ఆటంక పరుస్తున్నావు.

[5] నీ నోరు ఏం అనాలో నీ అపరాధం నేర్పుతూవుంది. కపటంగా మాట్లాడటానికి తీర్మానించుకున్నావు.

[6] నేను కాదు, నీ నోరే నీవు దోషివని ప్రకటిస్తుంది. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి.

[7] మనిషిగా పుట్టిన మొదటివాడివి నువ్వేనా? కొండలకంటే ముందే నీవు జన్మించావా?

[8] నువ్వు దేవుని సమాలోచనలో పాల్గొన్నావా? జ్ఞానమంతా నీ సొత్తేనా?

[9] మాకు తెలియనిది నీకు తెలిసినది ఏమిటి? మాకు అర్థం కానిది నీకు అర్థమైనదేమిటి?

[10] మా మధ్య తల నెరసిన వయోవృద్ధులున్నారు. నీ తండ్రికంటే వారు వయసులో పెద్ద.

[11] దేవుని ఓదార్పు నీకు తేలిక అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన భాషలు నీకు పట్టవు గదూ?

[12] నీ హృదయం నిన్ను ఎందుకిలా ఉద్రేకపరుస్తూవుంది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబారాయి?

[13] దేవుని మీద నీవెందుకలా కోపగించినట్టు? నీ నోటిమీదుగా అలాంటి మాటలు రానిస్తావెందుకు?

[14] నిష్కళంకుడై ఉండడానికి మనిషి ఏపాటి వాడు? నిర్దోషి కావడానికి స్త్రీ గర్భవాసాన పుట్టినవాడు ఎంతటివాడు?

[15] దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ ప్రదేశాలు ఆయన దృష్టిలో శుద్ధం కావు.

[16] అలాంటప్పుడు మనుషులు మరీ కల్మషం! వాళ్ళు నీచులు, భ్రష్టులు, నీళ్ళు త్రాగినట్టే అన్యాయాన్ని చేసేవారు.

[17] నేను చెప్పేది విను. నేను నీకో సంగతి తెలియజేస్తాను. నేను స్వయంగా చూచినదే చెపుతాను.

[18] జ్ఞానులు తమ పూర్వీకుల దగ్గరనుంచి సంపాదించి, ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశం నీకు చెపుతాను.

[19] వాళ్ళకు మాత్రమే ఈ భూమి ధారాదత్తం చేయబడింది. అప్పుడు వాళ్ళ మధ్య పరాయి వాళ్ళు లేరు.

[20] దుర్మార్గుడు బ్రతికినన్నాళ్ళు వేదనల పాలవుతాడు. దౌర్జన్యపరుడికి నియమించబడ్డ ఏళ్ళన్నిట్లో అతడికి బాధలు తప్పవు.

[21] అతడి చెవులలో భయంకరమైన ధ్వనులు మ్రోగుతాయి. శాంతియుతమైన కాలంలో వినాశకారులు అతడిమీదికి వచ్చి పడతారు.

[22] చీకట్లోనుంచి తిరిగి వస్తాడనే నమ్మకం వాడికి ఉండదు. అతడు ఖడ్గానికి గురి అవుతాడు.

[23] ‘ఆహారం ఎక్కడ దొరుకుతుందబ్బా!’ అంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజు దగ్గరపడ్డట్టు వాడికి తెలుసు.

[24] కడగండ్లు, వేదన వాణ్ణి భయకంపితుణ్ణి చేస్తాయి. యుద్ధసన్నద్ధుడైన రాజులుగా వచ్చి పట్టుకుంటాయి.

[25] ఎందుకని? అతడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. అమిత శక్తిగలవాణ్ణి ధిక్కరిస్తాడు.

[26] మెడ వంగని వైఖరితో, తన దిట్టమైన డాలుతో దేవుని మీదికి విజృంభిస్తాడు.

[27] అతడి ముఖం బాగా కొవ్వు దేలివుంది. అతడి నడుము చుట్టూరా కొవ్వు ఎక్కువైంది.

[28] అయినా, అతడు పాడుపడ్డ పట్టణాల్లో నివాసం ఉంటాడు. ఉండకూడని ఇండ్లలో ఉంటాడు. శిథిలమైపోతున్న కొంపల్లో ఉంటాడు.

[29] వాడు భాగ్యవంతుడుగా ఎంతోకాలం ఉండబోడు. వాడి ధనం నిలవదు. అతడి భూమి పంటతో బరువెక్కి నేలకు వంగదు.

[30] అతడు చీకటిని తప్పించుకుపోలేడు. మంటలు వాడి లేత మొక్కల్ని దహించివేస్తాయి. దేవుని ఊపిరికి వాడు కొట్టుకుపోతాడు.

[31] వాడు వ్యర్థమైన దానిని నమ్ముకోకుండా ఉంటాడు గాక! వాడు మోసపోయినవాడు. వ్యర్థం అనేదే అతడి ప్రతిఫలం.

[32] వాడి కాలం పూర్తి కాకమునుపే అదంతా జరుగుతుంది. వాడి కొమ్మ వాడిపోతుంది.

[33] వాడు పిందెలు రాలిన ద్రాక్ష చెట్టులాగా ఉంటాడు. పూత రాలిన ఆలీవ్ చెట్టులాగా ఉంటాడు.

[34] దైవభక్తి లేని వాళ్ళ గుంపు నిర్జీవమవుతుంది. లంచగొండి డేరాలను అగ్ని భస్మీపటలం చేస్తుంది.

[35] కీడు వాళ్ళ కడుపులో ఉంటుంది. చెడుగును వాళ్ళు కంటారు. వాళ్ళ అంతరంగంలో వంచన ఏర్పడుతుంది.

యోబు — Chapters