Skip to content
Opens in a new window

[1] “నీవు లివయాటాన్‌ను గాలం వేసి బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు గ్రుచ్చి లాగగలవా?

[2] నీవు దానికి ముక్కుత్రాడు వేయగలవా? దాని దవడకు గాలం గ్రుచ్చగలవా?

[3] దయ చూపమని అది నిన్ను ప్రాధేయపడుతూ ఉంటుందా? అది నీతో మెత్తమెత్తగా మాట్లాడుతుందా?

[4] అది నీతో ఒప్పదం చేసుకొంటుందా? నీవు దాన్ని ఎప్పటికీ దాస్యంలో ఉంచుకొంటావా?

[5] పక్షితో ఆడుకొన్నట్టు దానితో ఆటలాడుతావా? నీ ఆడపిల్లలు ఆడుకోవడానికి దాన్ని కట్టివేస్తావా?

[6] చేపలు పట్టేవారు దానితో వ్యాపారం చేస్తారా? వారు దాన్ని ముక్కలు చేసి వర్తకులకు అమ్ముతారా?

[7] దాని చర్మం నిండా శూలాలు గ్రుచ్చగలవా? దాని తలనిండా చేపలను పొడిచే బరిసెలు గ్రుచ్చగలవా?

[8] దాని మీద చేయి వేసుకొన్నావూ అంటే దానితో కొని తెచ్చుకొనే జగడం జ్ఞాపకముంచుకొంటావు! మళ్ళీ ఆ పని చేయవు.

[9] దాన్ని వశపరచే ఆశలన్నీ వృథా! దాన్ని చూస్తే చాలు, ఎవరైనా నిలువునా క్రుంగిపోతారు.

[10] దాన్ని లేపే సాహసం ఎవరికీ లేదు. అలాంటప్పుడు నా ఎదుట నిలవగలవాడెవడు?

[11] ఎవడు నాకేమి ఇచ్చాడు? నేనెవరికి ఏమి అచ్చివున్నాను? ఆకాశమంతటి క్రింద ఉన్నదంతా నాదే!

[12] దాని అవయవాలను గురించి నేనేమీ అనకుండా ఊరుకోను. దాని అధిక బలాన్ని గురించి, దాని తీరైన రూపాన్ని గురించి నేనేమీ చెప్పకుండా ఉండను.

[13] దాని మీది కవచాన్ని ఎవడు విప్పివేయగలడు? దాని రెండు దవడల మధ్యకు ఎవడైనా రాగలడా?

[14] దాని నోటి ద్వారాలను తెరవగలవాడెవడు? దాని దంత వలయం భయంకరం!

[15] దాని గట్టి పొలుసులను గురించి దానికెంతో గర్వం! అవన్నీ బిగువుగా కలిసివున్నాయి. వాటిని ఎవరూ తీయలేరు.

[16] వాటిలోకి గాలి కూడా చొరబడలేనంతగా అవి ఒకదానికొకటి దగ్గరదగ్గరగా ఉన్నాయి.

[17] అవి ఒకదానితో ఒకటి అంటుకొని ఉన్నాయి. అవి పెనవేసుకుపోయి ఉన్నాయి. వాటిని విడదీయడం ఎవరి తరమూ కాదు.

[18] అది తుమ్మిందీ అంటే వెలుగు చిమ్ముతుంది. దాని కండ్లు ఉదయ సూర్య కిరణాలలాంటివి.

[19] దాని నోట్లోనుంచి మండుతున్న దివిటీలు బయలుదేరినట్లుంటుంది. నిప్పు రవ్వలు అందులోనుంచి ఎగిరిపడినట్లుంటుంది.

[20] దాని ముక్కుపుటాలలో నుంచి పొగ బయలుదేరుతుంది. తుకతుక ఉడికే కాగులోనుంచి, జమ్ము మంటలో నుంచి వచ్చే పొగలాంటిదది.

[21] దాని ఊపిరివల్ల నిప్పు కణాలు రాజుతాయి. దాని నోట్లోనుంచి మంటలు ఎగసివస్తాయి.

[22] దాని మెడలో బలం నిలిచివుంది. దాని ముందర భయం తాండవిస్తుంది.

[23] దాని శరీరం ముడతలు ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉన్నాయి. అది దానిలో దట్టంగా, స్థిరంగా ఉంది.

[24] దాని గుండె రాయిలాగా గట్టిది. తిరగటిలో క్రిందిరాయిలాగా కఠినం.

[25] అది లేచిందీ అంటే బలాఢ్యులు కూడా భయపడుతారు. అధిక భయంతో తొలగిపోతారు.

[26] దానికి ఎదురయ్యే ఖడ్గం నిలవదు. ఈటె, బాణం, బరిసె, ఇవేమీ ఎందుకూ కొరగావు.

[27] దానికి ఇనుము గడ్డిపోచ, కంచు పుచ్చిపోయిన కట్టెతో సమానం.

[28] బాణం చూచి అది పారిపోదు. వడిసెల రాళ్ళు దానికి చెత్తతో సమానం.

[29] గదలు దానికి గడ్డిపరకలే! గలగలమనే ఈటెను చూచి అది నవ్వుతుంది.

[30] దాని క్రింది భాగాలు కరుకైన చిల్ల పెంకుల లాంటివి. బురద మీద నురిపిడి కర్రలాగా చాచుకొని పడుకొంటుంది.

[31] కాగు మసిలిపోయినట్లు లోతైన నీళ్ళు పొంగేలా చేస్తుంది. అది గొప్ప నదిని తైలం జాడీలాగా చేస్తుంది.

[32] నీళ్ళ మీద తాను పోతున్న దారి తన వెనకాలే మెరిసిపోయేలా చేస్తుంది. గొప్ప నదిని చూచేవారికి అది నెరసిన తలలాగా ఉంటుంది.

[33] భూమి మీద దాని సాటి ఏదీ రాదు. భయం లేనిదిగా అది సృజించబడింది.

[34] పెద్ద పెద్ద వాటినే చూస్తుంది. గర్వానికే పుట్టినట్టున్న అన్ని ప్రాణులకూ అది రాజు.

యోబు — Chapters