Skip to content
Opens in a new window

[1] “వెండికి గని ఉంది. బంగారాన్ని పుటం వేయడానికి స్థలం ఉంది.

[2] ఇనుము భూమిలో నుంచి తీస్తారు. రాళ్ళు కరిగించి రాగి తీస్తారు.

[3] మనుషులు చీకటికి అంతం కలిగిస్తారు. కటిక చీకటిలో, చావునీడలాంటి అంధకారంలో రత్నాలను వెదుకుతారు. భూమిలో చాలా లోతుగా వెదుకుతారు.

[4] మనుషులులేని చోట్ల సొరంగాలు తవ్వుతారు. మనుషులు మరచిపోయే స్థలాలలో మనుషులకు దూరంగా ఉండి, అటూ, ఇటూ ఊగులాడుతూ ఉంటారు.

[5] భూమి లోనుంచి ఆహారం వస్తుంది. మంటలవల్ల అయినట్టు భూగర్భంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి.

[6] దాని రాళ్ళలో నీలమణులు ఉంటాయి, దాని మట్టిలో బంగారం ఉంది.

[7] వేటాడే పక్షులకు దాని త్రోవ తెలియదు. అది డేగ కండ్లకు కూడా కనబడదు.

[8] గర్వం గల క్రూర మృగాలు ఆ దారి తొక్కలేదు. సింహం ఆ మార్గాన నడువలేదు.

[9] మనుషులు చెకుముకి రాతిలాంటి బండలు చేతపట్టుకొంటారు. కొండలను కూడా వాటి పునాదులతో పెళ్ళగించివేస్తారు.

[10] బండల్లో గుండా కాలువలు తవ్వుతారు. వారి కన్ను విలువైన ప్రతిదాన్ని పసికడుతుంది.

[11] నదులు పారకుండా చేసి మరుగుపడి ఉన్నదాన్ని వారు బహిర్గతం చేస్తారు.

[12] ఇంతకూ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహింపు లభించే స్థలం ఏది?

[13] మనుషులకు దాని విలువ తెలియదు. సజీవుల లోకంలో అది దొరకదు.

[14] మహా జలాగాధం అంటుంది – ‘అది నాలో లభించదు.’ సముద్రం ‘అది నా దగ్గర లేదు’ అంటుంది.

[15] మేలిమి బంగారాన్ని ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవడం జరగదు. వెండి కొల పోసి దాన్ని ఖరీదు చేయలేము.

[16] జ్ఞానం ఓఫీర్‌‌ బంగారానికి గానీ, విలువైన మిశ్రమ రత్నాలకు గానీ, నీలానికి గానీ దొరికేది కాదు.

[17] బంగారం గానీ స్పటికం గానీ దానికి సాటికావు. అమూల్యమైన సువర్ణాభరణానికి కూడా లభించదది.

[18] పగడాలు, ముత్యాలు, వీటిని గురించి దాని ఎదుట పేర్కొనవలసిన అవసరమే లేదు. జ్ఞానం కెంపుల విలువను మించినది.

[19] కూషులో దొరికే పుష్యరాగం దానికి సమానం కాదు. స్వచ్ఛమైన బంగారానికి కూడా అది దొరికేది కాదు.

[20] మరైతే, జ్ఞానం ఎక్కడనుంచి వస్తుంది? అవగాహనం లభించే స్థలమేది?

[21] అది సజీవుల కన్నులకు కనిపించదు. గాలిలో ఎగిరే పక్షులకు కూడా అది గోచరం కాదు.

[22] నాశనమూ, మృత్యువూ అంటాయి గదా – ‘మేము దాన్ని గురించిన వదంతి మాత్రమే విన్నాం’.

[23] దేవునికే దాని మార్గం తెలుసు. దాని స్థలం ఆయనకే తెలుసు.

[24] ఆయన భూదిగంతాలవరకు చూస్తూ ఉన్నాడు. ఆకాశం కింద ఉన్నదంతా ఆయనకు కనిపిస్తుంది.

[25] గాలి బరువు ఆయన నిర్ధారణ చేసినప్పుడు, జలాల కొలత నిర్ణయించినప్పుడు,

[26] వర్షపాతానికి నియమాలు ఏర్పరచినప్పుడు, ఉరుములకూ, మెరుపులకూ దారి ఏర్పరచినప్పుడు,

[27] జ్ఞానాన్ని చూస్తూ ఆయన దాన్ని అంచనా కట్టాడు. దాన్ని పరిశోధించాడు, సుస్థిరం చేశాడు.

[28] మానవులకు ఆయన ఇలా చెప్పాడు: యెహోవా పట్ల భయభక్తులు ఉండడమే జ్ఞానం. దుర్మార్గం విసర్జించడమే తెలివి.

యోబు — Chapters