[1] యోబు ఇంకా కావ్యరూపంలో చెప్పుకుపోయాడు:
[2] “గడిచిన నెలల్లోలాగే, దేవుడు నన్ను కాపాడే రోజుల్లోలాగే నేనుండగలిగితే ఎంతో బాగుండేది!
[3] అప్పుడు ఆయన దీపం నా తలపై వెలుగుతూ ఉండేది. ఆయన వెలుగుతో నేను చీకట్లో కూడా తిరుగాడగలిగేవాణ్ణి.
[4] ఆరోజుల్లో నాకు పరిపక్వమైన స్థితిగతులుండేవి. అలా నేనిప్పుడు ఉండగలిగితే ఎంతో బావుండేది! అప్పుడు నా డేరాకు పైగా దేవుని సహవాసం ఉండేది.
[5] అమిత శక్తిమంతుడు అప్పుడు ఇంకా నాకు తోడుగా ఉండేవాడు. నా పిల్లలు నా చుట్టు ఉండేవారు.
[6] నేను వేసిన అడుగెల్లా నేతిలోనే పడేది! నా కోసం నూనె బండలో నుంచి ప్రవహించేది.
[7] ఊరి ముఖద్వారానికి నేను వెళ్ళినప్పుడు, నడివీధిలో నా స్థానం మీద కూర్చున్నప్పుడూ,
[8] యువకులు నన్ను చూచి అవతలికి వెళ్ళేవారు. వృద్ధులు లేచి నిలిచేవారు.
[9] అధికారులు నోటి మీద చెయ్యి ఉంచుకొనేవారు, నోళ్ళు మూసుకొనేవారు.
[10] ప్రధానులు మాటలుడిగి మౌనంగా ఉండేవారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనేది.
[11] నా సంగతి చెవిని పడితే ప్రతివాడూ నన్నూ ధన్యజీవి అనేవారు, నన్ను చూచిన ప్రతి ఒక్కరూ నా గురించి మంచి సాక్ష్యం చెప్పేవారు.
[12] ఎందుకని? సహాయంకోసం మొర పెట్టిన బీదలను, దిక్కులేని అనాథలను నేను విడిపించాను.
[13] నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్నవారి ఆశీర్వాదాలు నా మీదికి వచ్చాయి. వితంతువుల హృదయాలకు నేను సంతోషం చేకూర్చాను.
[14] నీతి నిజాయితీ నేను ధరించిన దుస్తులు! అది నన్ను ధరించింది. న్యాయసమ్మతమైన నా ప్రవర్తన నాకు వస్త్రం, తలపాగా.
[15] గుడ్డివాళ్ళకు నేను కన్నులాగా ఉండేవాణ్ణి. కుంటివారికి నేనే కాళ్ళు.
[16] దరిద్రులకు నేను తండ్రిని. పరాయివారికి న్యాయ సమ్మతంగా వ్యాజ్యమాడిపెట్టాను.
[17] అక్రమస్థుల పళ్ళు రాలగొట్టాను. వాళ్ళ కోరలలో నుంచి కొల్లసొమ్ము లాగివేశాను.
[18] అప్పుడు నేననుకొన్నాను – ‘హంసలాగా నేను చాలా కాలం బ్రతికి, నా గూటి దగ్గరే చనిపోతాను,
[19] నా వేరుల చుట్టు నీళ్ళు ప్రసరిస్తాయి, రాత్రంతా మంచు నా కొమ్మల మీద నిలుస్తుంది,
[20] నాకు ఎప్పటికీ గౌరవమర్యాదలు ఉంటాయి, నా విల్లు నా చేతిలో ఎప్పుడూ బలంగానే ఉంటుంది.
[21] అప్పుడు మనుషులు నా మాటలు వినడానికి ఆశతో చెవి ఒగ్గివుండేవారు. మౌనంగా నా సలహాలు వినాలని పడివుండేవారు.
[22] నేను మాట్లాడిన తరువాత వారు మళ్ళీ మాట్లాడేవారు కాదు. నా మాటలు వారి మీద కురిసాయి.
[23] వాన కోసం కనిపెట్టుకొన్నట్టు వారు నా కోసం ఎదురు చూచేవారు. చిట్టచివరి వర్షబిందువు కోసమా అన్నట్టు వెడల్పుగా నోరు తెరచుకొని ఉండేవారు.
[24] వారు నిరాశకు లోనైవుంటే, వారిని చూచి నేను దయతో మందహాసం చేసేవాణ్ణి. నా ముఖకాంతి లేకుండా వారేమీ చేసేవారు కారు.
[25] నేను వారికి పెద్దగా కూర్చునేవాణ్ణి. వారి కోసం మార్గం ఎన్నుకొన్నాను. నేనప్పుడు సైన్యంలో రాజులాగా ఉండేవాణ్ణి. శోకంలో ఉన్నవారికి ఓదార్పు కలిగించేవాణ్ణి.