[1] అప్పుడు యోబు ఈ విధంగా జవాబు చెప్పాడు:
[2] “మీరే నిజంగా లోకమంతట్లోకీ మనుషులా! జ్ఞానమంతా మీతోనే అంతరించిపోతుందా!
[3] మీలాగే నాకూ మనసు ఉంది. నేను మీకేమి తీసిపోను. ఇలాంటి విషయాలు తెలియనివాడెవడు?
[4] నేను చేసిన ప్రార్థనలు దేవుడు విన్నాడు. అలాంటి నేను నా స్నేహితుల దృష్టిలో నవ్వుల పాలయ్యాను. న్యాయంగా, నిర్దోషంగా బ్రతికే నా గతి నగుబాట్లయింది.
[5] క్షేమంగా బ్రతికే మనుషులు దుర్దశలో ఉన్నవారిని తృణీకరిస్తారు. కాలు జారి పడినవారికి ఈ తృణీకారం తప్పదు.
[6] బందిపోటు దొంగల డేరాలు క్షేమంగానే ఉంటాయి. దేవునికి కోపం రేపేవాళ్ళు నిర్భయంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు తమ చేతి బలమే దేవుడు.
[7] ఇప్పుడు మృగాలను అడగండి. అవి మీకు బోధిస్తాయి. గాలిలో ఎగిరే పక్షులను అడిగితే, అవే చెప్తాయి.
[8] భూమి విషయం ఆలోచిస్తే, అదే మీకు నేర్పుతుంది. సముద్రంలోని చేపలు మీకు ఉపదేశం చేస్తాయి.
[9] యెహోవా తన చేతితో వీటన్నిటినీ సృజించాడని గ్రహించలేనివాడెవడు?
[10] సజీవమైన ప్రతి దాని ప్రాణం ఆయన చేతిలో ఉంది. ప్రతి మనిషి ఊపిరి ఆయన వశంలో ఉంది.
[11] నాలుకకు రుచి తెలుసు. అలాగే మాటలు ఎలాంటివో చెవి పరిశీలించి గుర్తిస్తుంది.
[12] వృద్ధులకు జ్ఞానం ఉండాలి గదా. దీర్ఘాయువు వల్ల వివేకం కలగాలి గదా.
[13] అయితే దేవునికి జ్ఞానమూ, బలప్రభావాలూ ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
[14] ఇదిగో ఆయన పడగొట్టాడంటే ఎవరూ దాన్ని మళ్ళీ కట్టలేరు. ఆయన మనిషిని ఖైదులో మూసివేస్తే ఎవరూ తెరవలేరు.
[15] చూడండి. ఆయన జలాలను ఆపివేస్తే అవి ఇంకిపోవలసిందే. వాటిని కట్టునుంచి విడిచిపెడితే జలప్రవాహం భూమిని ముంచెత్తుతుంది.
[16] బలమూ, జ్ఞానమూ ఆయనవి. మోసగాళ్ళు, మోసపొయ్యేవాళ్ళు ఆయన అధీనంలోనే ఉన్నారు.
[17] సలహాదారులను నగ్నంగా చేసి, బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. న్యాయాధిపతులు తెలివి తక్కువవారని రుజువు చేస్తాడాయన.
[18] రాజుల అధికారాన్ని ఆయన సడలిస్తాడు. వారి నడుములను సంకెళ్లతో బంధిస్తాడు.
[19] యాజులను నగ్నంగా చేసి, బందీలుగా వెళ్ళిపోయేలా చేస్తాడు. స్థిరంగా పాతుకుపోయిన వాళ్ళను ఆయన కూలదోస్తాడు.
[20] వాగ్ధాటి గల వాళ్ళను నోరాడకుండా చేస్తాడు. పెద్దల తెలివిని తొలగిస్తాడు.
[21] అధిపతులను ఆయన ధిక్కరిస్తాడు. బలాఢ్యుల్ని బలహీనుల్ని చేస్తాడు.
[22] చీకట్లోని లోతైన విషయాలను ఆయన వెలికి తీస్తాడు. చావు నీడను వెలుగులోకి తెస్తాడు.
[23] జనాలను గొప్ప చేస్తాడు, ధ్వంసం కూడా చేస్తాడు. వారి పొలిమేరలను విశాలం చేస్తాడు. వారిని తీసుకుపోతాడు కూడా.
[24] లోక ప్రజల నాయకుల వివేకాన్ని తొలగించివేస్తాడు. దారి కానరాని ఎడారిలో వాళ్ళు తిరుగులాడేలా చేస్తాడు.
[25] వాళ్ళు వెలుగు లేనివారై చీకట్లో తడుముకొంటూ ఉంటారు. వాళ్ళు మత్తుగా ఉన్న వాళ్ళలాగా తూలేట్టు చేస్తాడాయన.