[1] అప్పుడు షూహియావాడు బిల్దదు ఇలా బదులు చెప్పాడు:
[2] “ఎంతకాలం నువ్విలా మాటలకోసం వేటాడుతావు? ఆలోచన చెయ్యి. అప్పుడు మేము మాట్లాడుతాం.
[3] నీవెందుకు మమ్మల్ని మృగాలుగా, తెలివితక్కువ వాళ్ళుగా చూస్తున్నావు?
[4] కోపంచేత నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. నీ కోసమని భూమి అంతా పాడైపోవాలా? నీకోసమై కొండ తన స్థానం తప్పాలా?
[5] దుర్మార్గుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ నిప్పుమంట మండడం మానేస్తుంది.
[6] వాళ్ళ డేరాలో వెలుగే చీకటి అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది.
[7] వాళ్ళ బలమైన అడుగులు వాళ్ళను ఇరుకు త్రోవలోకి తెస్తాయి. వాళ్ళ సొంత పోకడలు వాళ్ళను పడలాగుతాయి.
[8] వాళ్ళ పాదాలే వాళ్ళను వలలోకి నడిపిస్తాయి. వాళ్ళు దానిమీద నడుస్తారు.
[9] బోను వాళ్ళ మడిమను పట్టుకుంటుంది. ఉచ్చులో చిక్కుకుంటారు.
[10] ఉరి వాళ్ళ కోసం నేలమీద పరచివుంది. వాళ్ళను పట్టుకునేందుకు దారిలోనే ఉచ్చు బిగించివుంది.
[11] అన్ని వైపుల నుంచీ భయం కొలిపే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. అడుగడుగునా అవి వాళ్ళను వెంటాడుతాయి.
[12] వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి విపత్తు కాచుకుని ఉంటుంది.
[13] అది వాళ్ళ శరీరాన్ని తినేస్తుంది. వాళ్ళ అవయవాలను మరణకరమైన రోగం తినేస్తుంది.
[14] వాళ్ళు డేరాలో నిర్భయంగా ఉంటే అక్కడనుంచి వాళ్ళను పెరికివేయడం జరుగుతుంది. వాళ్ళు భయంకరుడైన రాజు దగ్గరికి ఖైదీగా తరలిపోవాలి.
[15] వాళ్ళకు కాని ఇతరులు వాళ్ళ గుడారంలో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసం మీద గంధకం చల్లడం జరుగుతుంది.
[16] వాళ్ళ వేళ్ళు క్రిందివి, క్రిందే వాడిపోతాయి. పైవి పైననే వాళ్ళ కొమ్మలు ఎండిపోతాయి.
[17] భూమిమీద వాళ్ళ జ్ఞాపకం తుడిచి పెట్టుకుపోతుంది. భూతలం మీద వాళ్ళ పేరెక్కడా నిలవదు.
[18] వాళ్ళను వెలుగులోనుంచి చీకట్లోకి తరిమివేస్తారు. భూమిమీద నుంచి వాళ్ళను తన్ని తరిమేస్తారు.
[19] వాళ్ళకు స్వప్రజల్లో సంతానం, వంశం ఉండవు. వాళ్ళ నివాసాల్లో ఒకడూ తప్పించుకు వచ్చినవాడు ఉండడు.
[20] వాళ్ళకు పట్టే గతిని చూచి పశ్చిమ దేశస్థులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళకు భయభ్రాంతులు కలుగుతాయి.
[21] అన్యాయస్థుల కొంపలకు, దేవుణ్ణి ఎరగని వాళ్ళ స్థలానికి ఇదే గతి పడుతుంది.