Skip to content
Opens in a new window

[1] అప్పుడు నయమాతువాడు జోఫరు ఈ విధంగా జవాబు చెప్పాడు:

[2] “నా ఆతురతను బట్టి నా ఆలోచనలు నన్ను జవాబిచ్చేలా బలవంతం చేస్తున్నాయి.

[3] నన్ను అవమానించే నింద నేను వినవలసివచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురికొలుపుతూ ఉంది.

[4] అనాది కాలంనుంచీ, మనిషిని భూమిమీద ఉంచడం జరిగినప్పటినుంచీ ఎలా ఉందో నీకు తెలియదూ?

[5] దుర్మార్గుల ఆనందధ్వనులు ఉండేది కాసేపే! దైవభక్తి లేని ప్రజల సంతోషం క్షణికం!

[6] వాళ్ళ గొప్పతనం ఆకాశాన్నంటేటంత ఎత్తుకు లేవవచ్చు. వాళ్ళు మేఘాలంత ఎత్తు తలలెత్తుకు తిరగవచ్చు.

[7] కానీ వాళ్ళ మలంలాగే వాళ్ళు ఎన్నటికీ లేకుండా గతించిపోతారు. అంతకుముందు వాళ్ళను చూచిన వారు ‘వాళ్ళేరీ?’ అని అడుగుతారు.

[8] కలలాగా ఎగిరిపోతారు వాళ్ళు. మళ్ళీ కనబడరు. రాత్రి స్వప్నంగా వాళ్ళను చెదరగొట్టడం జరుగుతుంది.

[9] వాళ్ళను చూచిన కన్ను ఇంకా వాళ్ళను చూడదు. వాళ్ళ స్థలంలో వాళ్ళు మళ్ళీ కనిపించరు.

[10] వాళ్ళ పిల్లలు దరిద్రుల దగ్గర అడుక్కుంటారు. చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చేస్తారు.

[11] వాళ్ళ ఎముకల్లో యువ బలం నిండి ఉన్నా, అదంతా మట్టిలో వాళ్ళతోపాటే పడుకుంటుంది.

[12] చెడుగు వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. నాలుక క్రింద దాన్ని మాటు పెట్టుకునే వాళ్ళు,

[13] దాన్ని పదిలం చేసుకునే వాళ్ళు. దాన్ని ఒక పట్టాన పోనియ్యరు. నోట్లోనే దాన్ని అట్టిపెట్టుకునేవాళ్ళు.

[14] అయితే వాళ్ళ కడుపులో తిన్నదంతా పాసిపోతుంది. వాళ్ళలో అదంతా నాగుపాము విషంగా మారుతుంది.

[15] ఐశ్వర్యాన్ని దిగమింగేశారు గాని అదంతా బయటికి కక్కేస్తారు. కడుపులో ఇమడకుండా దాన్ని దేవుడే కక్కిస్తాడు.

[16] వాళ్ళు కట్లపాము విషం లోపలికి పీల్చుకునే వాళ్ళు. పాము కోరలు వాళ్ళను చంపేస్తాయి.

[17] వాగులై, నదులై పారే తేనె మీగడలను ఇక చూచి సంతోషించరు.

[18] వాళ్ళు శ్రమించి సంపాదించుకున్నది కాస్తా అనుభవించకుండానే తిరిగి ఇచ్చివేయాలి. తాము సంపాదించిన ఆస్తిని బట్టి వాళ్ళకు సంతోషం కలగదు.

[19] దరిద్రుల మీద దౌర్జన్యం చేసి వదిలిపెట్టే వాళ్ళు, తాము కట్టని ఇండ్లను బలాత్కారంగా ఆక్రమించేవాళ్ళు. వాటిని కట్టి ముగించరు.

[20] వాళ్ళ పేరాశకు విరామమంటూ లేదు. తమకు ప్రీతిపాత్రమైన వాటితో తమను విపత్తునుంచి తప్పించుకోలేరు.

[21] వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అంచేత వాళ్ళ అభివృద్థి కొనసాగదు.

[22] వాళ్ళకు సమృద్ధి కలిగిన రోజులోనే వాళ్ళు ఇబ్బంది పాలవుతారు. దుర్దశలో ఉన్నవారంతా వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటారు.

[23] వాళ్ళు కడుపు నింపుకుంటుండగా దేవుడు తన తీవ్ర కోపాన్ని వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. వాళ్ళు తింటూ ఉండగానే అలా చేస్తాడు.

[24] ఇనుప ఆయుధం బారినుండి తప్పించుకుపోవాలని చూస్తారు. కంచు వింటినుంచి వెలువడ్డ బాణం వాళ్ళలోగుండా దూసుకుపోతుంది.

[25] అది శరీరాన్ని చీల్చేస్తుంది. అందులో గుండా చొచ్చుకుపోతుంది. అది బయటికి తీస్తే పైత్య రసం కారుతుంది. మృత్యు భయం వాళ్ళను ఆవరిస్తుంది.

[26] వాళ్ళు కూడబెట్టుకొన్నవి చీకటిమయం అవుతాయి. ఎవరూ ఊదని మంటలు రాజుకుని వాళ్ళను మింగివేస్తాయి. వాళ్ళ డేరాలో మిగిలిన దాన్ని నాశనం చేస్తాయి.

[27] వాళ్ళ అపరాధాన్ని ఆకాశం బట్టబయలు చేస్తుంది. భూమి వాళ్ళ మీదికి ఎగబడుతుంది.

[28] వాళ్ళ ఇంటి సంపద అంతర్ధానమై పోతుంది. దేవుని ఆగ్రహ దినాన అదంతా వరదపాలైపోతుంది.

[29] దేవుని దగ్గరనుంచి చెడ్డవాళ్ళకు దొరికేది ఇదే! దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే!

యోబు — Chapters